కృష్ణంరాజును వైఎస్సార్ ఏమని పిలిచేవారో తెలుసా..?: జగన్ నివాళి
అమరావతి: ప్రముఖ సినీ నటుడు, టాలీవుడ్ రెబెల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలంగా కృష్ణంరాజు అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారు జామున తుది శ్వాస విడించారు. ఆయన మృతిపట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు.
1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు జన్మించారు. హీరోగా సినీరంగ ప్రవేశం చేసి విలన్‌గానూ రాణించారు. 1966లో చిలకా గోరింక సినిమా ద్వారా చిత్ర రంగం ప్రవేశం చేశారు. 183 సినిమాల్లో నటించారు. ఆయన నటించిన చివరి సినిమా రాధేశ్యామ్. రాజకీయాల్లో కూడా కృష్ణంరాజు సత్తా చాటారు. బీజేపీలో చేరారు. 1998లో కాకినాడ, 1999లో నర్సాపురం లోక్‌సభ స్థానాల నుంచి ఎంపీగా గెలిచారు. వాజ‌్‌పేయి హయాంలో రక్షణ శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఓడిపోయారు.

రాజకీయాలకు అతీతంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కృష్ణంరాజు సన్నిహిత సంబంధాలను కొనసాగించారు. వైఎస్ కుటుంబాన్ని అభిమానించేవారు. 2018లో సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవ సమయంలో- వైఎస్సార్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని కృష్ణంరాజు గుర్తు చేసుకున్నారు. సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డు తన కేరీర్‌లో అత్యంత ప్రత్యేకతతో కూడుకుని ఉన్నదని వ్యాఖ్యానించారు. దీనికి గల కారణాలను ఆయన వివరించారు.
వైఎస్సార్- తాను మంచి స్నేహితులమని కృష్ణంరాజు చెప్పారు. తాను ఎక్కడ ఉన్నా.. ఎంతమందిలో ఉన్నా గానీ రేయ్ రాజా అని వైఎస్సార్ తనను పిలిచేవాడని గుర్తు చేసుకున్నారు. తాను కూడా ఆయనను రాజా అంటూ ఆప్యాయంగా పిలిచేవాడినని అన్నారు. రాజశేఖర్ రెడ్డిని గొప్ప నేతగా అభివర్ణించారు. తాను ఎంతగానో అభిమానించే నాయకుడి చేతుల మీదుగా ప్రారంభమైన, ఆయన కుటుంబానికి చెందిన సాక్షి నుంచి ఎక్స్‌లెన్స్ అవార్డ్ అందుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు.

కృష్ణంరాజు మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమైనవిగా చెప్పారు. కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని అన్నారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని వైఎస్ జగన్ అన్నారు.












Click it and Unblock the Notifications