జగన్‌కు షాక్: వరుసగా పార్టీని వీడుతున్న నేతలు
హైదరాబాద్: గతంలో హుషారుగా వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతూ వచ్చిన నాయకులు ఒక్కరొక్కరే ఆ పార్టీ నుంచి తప్పుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి మారెప్ప నుంచి ఒక్కరొక్కరే పార్టీని వీడుతుండడంతో జగన్‌కు కష్టకాలం ప్రారంభమైనట్లు భావిస్తున్నారు. ఇందుకు జగన్ వైఖరి ఓ కారణం కాగా, పడిపోతున్న ఆయన గ్రాఫ్ మరో కారణమని విశ్లేషకులు ఉంటున్నారు.
తాజాగా, రఘురామ కృష్ణంరాజు పార్టీని వైయస్సార్ కాంగ్రెసు పార్టీని వీడే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఈ విషయంపై శుక్రవారం అధికారిక ప్రకటన చేయవచ్చునని వార్తలు వస్తున్నాయి. ఆయన బిజెపిలో చేరే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అలాగే, నల్లగొండ జిల్లాకు చెందిన సంకినేని వెంకటేశ్వర రావు కూడా వైయస్సార్ కాంగ్రెసుకు సలాం కొట్టే పరిస్థితి ఉన్నట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వచ్చిన ఆయన బిజెపిలో చేరే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని నడిపించిన జగన్ చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి కూడా పార్టీకి దూరమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఒంగోలు లోక్‌సభ సీటు ఆశించి ఆయన భంగపడ్డారని, అందుకే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని వివరిస్తున్నాయి.
రఘురామ కృష్ణంరాజు నరసాపురం లోక్‌సభ సీటు ఆశించారు. ప్రచార సామగ్రిని సిద్ధం చేసుకున్నారు. ఆయనను నిలువరించేందుకు జగన్ సమీప బంధువు వైఎస్ అనిల్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమయ్యాయని, బిజెపిలో చేరి నరసాపురం సీటు కోరాలని ఆయన భావిస్తున్నారని ఆ వర్గాలు వివరించాయి. జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన మరో పారిశ్రామికవేత్త పివిపి వెంచర్స్ అధినేత పొట్లూరి వరప్రసాద్ విజయవాడ లోక్‌సభ సీటు ఆశించారు. ఆయన కూడా పార్టీకి దూరమవుతున్నట్లు తెలుస్తోంది.
తోట చంద్రశేఖర్ కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి బయటకు రావచ్చునని వార్తలు వస్తున్నాయి. తన కుమారుడి కోసం రాజమండ్రి లోక్‌సభ స్థానాన్ని ఆశించిన బొడ్డు భాస్కర రామారావు కూడా జగన్‌కు దూరమవుతున్నట్లు తెలుస్తోంది. గుజరాత్‌లో ఐఎఎస్ అధికారిగా పని చేస్తున్న కిశోర్ తన పదవికి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెసులో చేరాలని భావించారు. బాపట్ల ఎంపి టికెట్ ఇస్తే వస్తానని చెప్పిన ఆయన ఇప్పుడు బిజెపి వైపు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications