అలిపిరి టోల్ గేట్ వద్ద..
Tirumala: గతంలో లాగే తిరుమలలో మరోసారి చిరుతల సంచారం మళ్లీ ఆరంభమైనట్టే కనిపిస్తోంది. తాజాగా అలిపిరి టోల్ గేట్ వద్ద చిరుత సంచరించింది. అక్కడితో ఆగలేదు. ఓ జింకపై దాడి చేసింది. ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తోన్న వాహనదారులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. సమాచారం అందుకున్న వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. భద్రత చర్యలు చేపట్టారు.
కొద్ది రోజులుగా తిరుపతి- తిరుమల మెట్ల మార్గంలో చిరుత కనిపించడం పరిపాటిగా మారింది. ఇదివరకు అలిపిరి నడక దారిలో చిరుత సంచరించిన విషయం తెలిసిందే. 350వ మెట్టు సమీపంలో, అలిపిరి- శ్రీవేంకటేశ్వర జూ పార్క్ మార్గంలో, శ్రీవేంకటేశ్వర యూనివర్శిటీ క్యాంపస్ ఆవరణలో అది సంచరించింది. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అప్పట్లో. ఇప్పుడు తాజాగా మళ్లీ చిరుత కనిపించడం కలకలం రేపింది. వాహనదారులు, శ్రీవారి భక్తుల్లో భయాందోళనలను నింపింది.

ఈ తెల్లవారు జామున అలిపిరి టోల్ గేట్ వద్ద చిరుత సంచారం కనిపించింది. సమీప పొదల్లో ఓ జింక కళేబరాన్ని శ్రీవారి భక్తులు గుర్తించారు. ఈ విషయాన్ని టీటీడీ అటవీ విభాగం సిబ్బంది తెలియజేశారు. సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది దీన్ని స్వాధీనం చేసుకున్నారు. చిరుత దాడి చేయడం వల్లే జింక మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. దీని కదలికపై నిఘా పెట్టారు.
అలిపిరి కాలినడక మార్గంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఇదివరకే అమర్చిన సీసీటీవీ కెమెరాల ద్వారా చిరుత సంచారాన్ని పసిగడుతున్నారు. సీసీటీవీ ఫుటేజీని నిశితంగా పరిశీలిస్తోన్నారు. ప్రస్తుతానికి ఇది అలిపిరి పరిసర ప్రాంతాల్లోనే తిరుగాడుతుండొచ్చనే నిర్ధారణకు వచ్చారు. కాలినడకన తిరుమలకు రాకపోకలు సాగిస్తోన్న భక్తులకు జాగ్రత్తలను సూచించారు.
శేషాచలం అడవుల్లో చిరుతలు, ఎలుగుబంట్లు, ఇతర వణ్య ప్రాణుల సంఖ్య భారీగా పెరుగుతోందనడానికి తాజా ఉదంతం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గత మూడేళ్లుగా చిరుతల సంచారం బాగా పెరిగింది. అలిపిరి, శ్రీవారిమెట్టు, గాలి గోపురం పరిసర ప్రాంతాల్లో చిరుతలు కనిపించాయి అప్పట్లో. వాటిని కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించడానికి సుమారు 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలిపిరి నుంచి గాలిగోపురం, శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, 38వ మలుపు, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం క్యాంపస్ సహా మొత్తం ఏడు చోట్ల చిరుతల సంచారాన్ని గుర్తించారు.
ఇప్పుడు మరోసారి చిరుతల బెడద మొదలైంది. దీన్ని నివారించడంపై టీటీడీ ఇప్పటికే దృష్టి సారించింది. అలిపిరి మార్గాన్ని చిరుత రహిత ప్రాంతంగా మార్చడానికి కెమెరా ట్రాప్స్, స్మార్ట్ స్టిక్స్, బయో ఫెన్సింగులు, నెట్ గన్స్, హై ఫ్లాష్ టార్చ్ లైట్లు, పెప్పర్ స్ప్రేలు.. తదితర వస్తువులను రక్షణ పరికరాల వినియోగించేలా నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications