పండుగ వేళ వదలనంటున్న వరణుడు - ఈ జిల్లాలకు భారీ హెచ్చరిక..!!
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు మొదలయ్యాయి. వినాయక చవితి వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే ఉత్తరాంధ్రలో వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో వర్షం కొనసాగుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజులు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీ, తెలంగాణలోని జిల్లాలకు తాజా అలర్ట్ జారీ చేసింది.
పండుగ సమయంలో వరణుడు వదలనంటున్నాడు. వాయువ్య బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది వచ్చే రెండు రోజుల్లో పశ్చిమ - వాయువ్య దిశగా కదులుతూ మరింత బలంగా మారే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ రెండు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు.

ఇదే సమయంలో రుతుపవన ద్రోణి ప్రభావంతో మహబూబాబాద్, ములుగు, వరంగల్ భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జిల్లాల పరిధిలో పలుచోట్ల భారీ వర్షాలు, ఇతర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన 30-40 కి.మీ వేగంతో గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ధర్మరాజు వెల్లడించారు. ఇక.. హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంది. పలు ప్రాంతాల్లో మోస్తరు వానలు పడుతున్నాయి. చందానగర్, మియాపూర్, కొండాపూర్, హఫీజ్పేట్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, దిల్ షుక్ నగర్, వనస్థలిపురంలో వర్షం కురుస్తోంది. అల్పపీడన ప్రభావంతో వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు జల్లులు పడుతున్నాయి. హనుమకొండ, వరంగల్ కాజీపేటల్లో ఉదయం నుంచి తేలికపాటి వర్షం కురుస్తోంది. మరో మూడు రోజుల పాటు ఈ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.












Click it and Unblock the Notifications