భారీ వర్షాలు: స్టేడియం పక్కన పిడుగు.. భీతిల్లిన మహిళా క్రికెటర్లు, ఏపీలో 23మంది మృతి
హైదరాబాద్/అమరావతి: ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కుండపోత వర్షం కురిసింది. రోడ్లు వాగులు అయ్యాయి. ఏపీ, తెలంగాణలలో మరో ఇఱవై నాలుగు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలో వర్షంతో పాటు పిడుగులు పడ్డాయి. దీంతో, 23 మంది మృతి చెందారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తండ్రీకొడుకులు, ప్రకాశం జిల్లాల్లో అత్తాకోడళ్లు మృతి చెందారు. పలు ప్రాంతాల్లో హఠాత్తుగా కురిసిన భారీ వర్షం రైతులను ఊరడించగా, ప్రజలను బెంబేలెత్తించింది.
ఉరుములు, మెరుపులు, పిడుగులతో కుండపోతగా కురిసిన వానతో జనం భీతిల్లిపోయారు. ఏపీలో పంటలకు ప్రాణం పోసిన వర్షాలు, పొలం పనుల్లో ఉన్న పలువురు రైతుల ప్రాణాలు తీశాయి. ఒడిశా నుంచి కోస్తా జిల్లాల మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉంది.

మరోవైపు బంగాళాఖాతంలో వాయవ్య దిశ నుంచి పశ్చిమ మధ్యభాగం వరకు తక్కువ ఎత్తులో ఉపరితల ద్రోణి ఆవరించిఉంది. సోమ, మంగళవారాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతోపాటు పిడుగులు పడి 23 మంది మృతిచెందారు. అత్యధికంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో ఆరుగురు మృతి చెందారు. ప్రకాశం జిల్లాలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు, తూర్పు గోదావరి, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున పిడుగుపాటుకు మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు గాయపడ్డారు.

23 మంది మృతుల్లో ఎక్కువ మంది రైతు కూలీలే. వరినాట్లు వేస్తుండగా ఒకరు, పొలానికి వస్తూ ఇంకొకరు, పొలంలో బోరు వేస్తూ మరొకరు ఇలా వివిధ పనుల్లో ఉన్నవారు పిడుగుపాటుకు బలయ్యారు.
ఏపీ, త్రిపుర రాష్ట్రాల మహిళా క్రికెటర్లు భీతిల్లారు
గుంటూరు నగరం సమీపంలోని ఆంధ్ర క్రికెట్ స్టేడియం పక్కనే పిడుగు పడడంతో ఆ సమయంలో మైదానంలో తలపడుతున్న ఏపీ, త్రిపుర రాష్ట్రాల మహిళా క్రికెటర్లు భీతిల్లిపోయారు. మార్కాపురం మండలం వేములకోటలో మధ్యప్రదేశ్ రాష్ట్రం కేతుల్ జిల్లాకు చెందిన సతీష్(23) అనే యువకుడు వ్యవసాయ బోరు వేసే పని చేస్తుండగా పిడుగు పడటంతో ప్రాణాలు కోల్పోయాడు.












Click it and Unblock the Notifications