ముందుగానే దీపావళి వచ్చేసింది, బాబులు సంబరాలు, ఏసేయ్
ఆంధ్రప్రదేశ్ లో మందుబాబులు సంబరాలు చేసుకుంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో దిక్కుమాలిన బ్రాండ్ల మద్యం తాగి నాలుక పీక్కుపోయిందని, మా ఆరోగ్యం పాడైందని మందుబాబులు మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం నూతన మధ్యం పాలసీ అమలులోకి వచ్చింది.
రాష్ట్రంలో మద్యం దుకాణాలకు టెండర్లు కూడా పూర్తి అయిపోయాయి. ఈరోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా లిక్కర్ షాపులు ప్రత్యక్షం అయ్యాయి. అన్ని మద్యం షాపుల్లో ప్రముఖ బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి రావడంతో మందుబాబులు చిందులు వేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో దిక్కుమాలిన మద్యం తాగి మా లివర్ పాడైపోయిందని, చాలా మంది సాటి మందుబాబులు పైలోకాలకు కూడా వెళ్లిపోయారని మద్యం ప్రియులు ఆరోపిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం విధానం అమల్లోకి రావడం, లిక్కర్ రేట్లు తక్కువగా ఉండడంతో మందుబాబులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మందుబాబులకు అందరికంటే ముందుగానే దీపావళి పండగ వచ్చేసింది. తక్కువ ధరకు మద్యం తీసుకొని హ్యాపీగా తాగేసి ఎంజాయ్ చేయాలని మందుబాబులు లిక్కర్ షాపుల ముందు క్యూ కడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో చీప్ లిక్కర్ క్వాటర్ రూ. 200 నుంచి రూ. 250 రూపాయల వరకు ఉండేది.
అయితే ప్రస్తుతం వంద రూపాయలకే చీప్ లిక్కర్ అందుబాటులోకి వస్తుందని కూటమి ప్రభుత్వం తెలిపింది. అయితే రూ. 100 రూపాయలకే చీప్ లిక్కర్ అందుబాటులో ఉంటుందా, లిక్కర్ సిండికేట్ మద్యం రేట్లు పెంచుతుందా అనే విషయం ఒకటి రెండు రోజుల్లో తెలిసిపోతుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో లిక్కర్ సిండికేట్ మద్యం రేట్లు ఫిక్స్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఏ ప్రాంతాల్లో లిక్కర్ సిండికేట్ ఉందో అనే విషయం తెలియాలంటే రెండుమూడు రోజులు వేచి చూడాలి అని మందుబాబులు అంటున్నారు.

కొత్తగా లిక్కర్ షాపులు ప్రారంభించిన రెండు మూడు రోజుల్లోనే అధిక ధరలు పెడితే లేనిపోని సమస్యలు వస్తాయని లిక్కర్ సిండికేట్ వ్యాపారులు ఆలోచిస్తున్నారని సమాచారం. గత వైసీపీ ప్రభుత్వంలో మందు బాబులను నిలువు దోపిడీ చేశారని, అధిక ధరలకు మద్యం విక్రయించారని మందుబాబులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా లిక్కర్ సిండికేట్ అధిక ధరలు వసూలు చేయకుండా కూటమి ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని డిసైడ్ అయ్యింది.
ఎవరైనా అధిక ధరలకు మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇప్పటికే హెచ్చరించారు. అయితే కూటమి ప్రభుత్వం పెద్దల మాటను లిక్కర్ వ్యాపారులు ఏమాత్రం గౌరవిస్తారు అనే విషయం త్వరలోనే తేలిపోతుందని మందుబాబులు అంటున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో మందుబాబులకు ముందుగానే దీపావళి పండగ వచ్చేసింది.












Click it and Unblock the Notifications