ఈ ప్రాంతాల్లో రెండు రోజులు మద్యం అమ్మకాలు బంద్..!!
మందుబాబులకు బిగ్ అలర్ట్. ఏపీలో రెండు రోజుల పాటు మద్యం షాపులు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేసారు. మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 1వ తేదీన పోలింగ్ జరగనుంది. 3వ తేదీన ఎన్నికల ఓట్ల లెక్కింపుకు నిర్ణయించారు. దీంతో.. ముందస్తు జాగ్రతల్లో భాగంగా మందు దుకాణాలను మూసివేయాలని డిసైడ్ అయ్యారు. ఈ రోజు సాయంత్రంతో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో.. ఈ సాయంత్రం నుంచి మద్యం దుకాణాలు మూసివేయనున్నారు.
ఏపీలో మున్సిపల్ ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. ఈ రోజు సాయంత్రం 5గంటలకు ప్రచారం ముగియనుంది. ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసిన తర్వాత ఎలాంటి ప్రచార కార్య క్రమాలు నిర్వహించకూడదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘించి సాయంత్రం 5 గంటల తర్వాత కూడా ప్రచారం కొనసాగించే అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల అధికారులకు ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎక్సైజ్ శాఖ మద్యం విక్రయాలపై ఆంక్షలు విధించింది. నేటి సాయంత్రం 5 గంటల నుంచి నవంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలోని వైన్ షాపులు, బార్లు మూసివేయాలని స్పష్టం చేసారు.

ఎన్నికల సంఘం కట్టుదిట్టంగా ఏర్పాట్లు
రాష్ట్ర వ్యాప్తంగా 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. నవంబర్ 3న ఓట్ల లెక్కింపు సందర్భంగా కూడా మద్యం విక్రయాలు నిలిపివేయనున్నారు. అక్రమంగా మద్యం విక్రయించినా, నిల్వ చేసినా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. నవంబర్ 1న జరగనున్న పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఏపీ ఎస్ఈసీ అనిల్‌చంద్ర పునేఠా వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, వీడియో చిత్రీకరణ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టనున్నట్లు తెలిపారు. మొత్తం 4,372 పోలింగ్ కేంద్రాల పరిధిలో 36,351 మంది పోలీసు సిబ్బందిని భద్రతా విధులకు కేటాయించినట్లు వివరించారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.













Click it and Unblock the Notifications
