Lok Poll Survey: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే- వైసీపీ పరిస్థితేంటీ? టీడీపీకి ఎన్నిసీట్లు?
ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే- ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే విషయం మీద లోక్ పోల్ తాజాగా ఓ సర్వే నిర్వహించింది. ఇందులో- ఏపీలో వైఎస్ఆర్సీపీ హవా కనిపించింది.
అమరావతి: దేశంలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. తెలంగాణ, కర్ణాటక సహా దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడనున్నాయి. ఇప్పటికే మేఘాలయా, నాగాలాండ్, త్రిపుర ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది కూడా. ఈ నెల 16వ తేదీన త్రిపుర, 27వ తేదీన మేఘాలయా, నాగాలాండ్ లల్లో పోలింగ్ షెడ్యూల్ అయింది. మార్చి 2వ తేదీన ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది. వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికలకు వీటిని సెమీ ఫైనల్ గా భావిస్తోన్నారు.

తాజా సర్వే..
ఈ పరిణామాల మధ్య తాజాగా ఓ ఎన్నికల సర్వే వెలువడింది. లోక్ పోల్ అనే సంస్థ ఈ సర్వే చేపట్టింది. తన సర్వే నివేదికను వెల్లడించింది. 2024లో జరగబోయే లోక్ సభ ఎన్నికలపై నిర్వహించిన సర్వే ఇది. ఉత్తర-దక్షిణాది రాష్ట్రాల్లో గల లోక్ సభ స్థానాలను విభజించింది. విడతల వారీగా దీన్ని విడుదల చేసింది. ఇప్పటివరకు రెండు విడతల సర్వే ఫలితాలను వెల్లడించిందీ లోక్ పోల్ సంస్థ.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..
ఉత్తరాది రాష్ట్రాల్లో 225, దక్షిణాదిన 132 స్థానాలకు సంబంధించిన ఫలితాలను తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న లోక్ సభ స్థానాలకు ఇప్పటికప్పుడు ఎన్నికలను నిర్వహించాల్సి వస్తే.. పరిస్థితేమిటనేది స్పష్టం చేసింది. ఎవరు రాజవుతారు? ఎవరు బంటు అవుతారనేది తేల్చి చెప్పింది. కేంద్రంలో అధికారంలో ఎవరు వస్తారనేది కుండబద్దలు కొట్టింది.

రాష్ట్రాలవారీగా..
జాతీయ, ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక లోక్‌సభ స్థానాలు ఎవరి ఖాతాలో పడతాయనేది వెల్లడించింది. రాష్ట్రాలు, పార్టీల వారీగా మెజారిటీ లోక్‌సభ స్థానాల్లో ఎవరి జెండా ఎగురుతుందనేది తేల్చేసింది. లోక్ పోల్ సర్వే ప్రకారం చూస్తే కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ సంకీర్ణ కూటమి వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమైంది. ఇప్ప్పుడున్న లోక్‌సభ స్థానాల కంటే కొన్ని సీట్లు తగ్గినప్పటికీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని అంచనా వేసింది.

మరిన్ని సీట్లు..
357 లోక్ సభ స్థానాల్లో సర్వే చేపట్టింది. ఉత్తరాదిన 225 స్థానాల్లో బీజేపీ-142 చోట్ల విజయం సాధిస్తుందని లోక్ పోల్ తెలిపింది. కాంగ్రెస్- 30 స్థానాలకే పరిమితమౌతుందని అంచనా వేసింది. ఇతరులు 53 లోక్ సభ నియోజకవర్గాల్లో పాగా వేస్తారని స్పష్టం చేసింది. రాష్ట్రాలవారీగా చూసుకుంటే- హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ, కాంగ్రెస్ కు రెండు చొప్పున గెలుస్తాయని తెలిపింది. ఉత్తరాఖండ్ లో బీజేపీ- 4, కాంగ్రెస్-1, హర్యానాలో బీజేపీ-5, కాంగ్రెస్ 4, ఇతరులు ఒక చోట గెలుస్తారు.

మళ్లీ యూపీలో..
ఢిల్లీలో బీజేపీ-7, ఆమ్ ఆద్మీ పార్టీ-1, ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ-56, కాంగ్రెస్-2, సమాజ్ వాది పార్టీ-13, ఇతరులు 9, బిహార్ లో బీజేపీ-14, కాంగ్రెస్-2, జేడీయూ-10, ఆర్జేడీ-9, జార్ఖండ్ లో బీజేపీ-7, కాంగ్రెస్-2, జేఎంఎం-4, రాజస్థాన్ లో బీజేపీ-25, కాంగ్రెస్ 21, మధ్యప్రదేశ్ లో బీజేపీ-29, కాంగ్రెస్ 9, ఛత్తీస్ గఢ్ లో బీజేపీ 7, కాంగ్రెస్ 4 స్థానాలను గెలుచుకుంటాయి.

దక్షిణాదిన..
దక్షిణాది రాష్ట్రాల్లో 132 లోక్ సభ స్థానాల్లో లోక్ పోల్ సర్వే చేపట్టింది. ఇందులో బీజేపీ-21, కాంగ్రెస్-39, ఇతరులు 72 స్థానాలను గెలుచుకుంటారని తెలిపింది. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని లోక్ పోల్ తేల్చింది. రాష్ట్రంలో 25 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అందులో 17 చోట్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఘన విజయాన్ని సాధిస్తారని పేర్కొంది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులు ఏడు లోక్‌సభ స్థానాలకు మాత్రమే పరిమితమౌతారని అంచనా వేసింది. అంటే- ప్రస్తుతం టీడీపీకి ఉన్న లోక్‌సభ స్థానాల సంఖ్య మూడు. దీన్ని ఏడుకు పెంచుకోగలుగుతుంది.

తెలంగాణలో..
తెలంగాణ మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అందులో భారత్ రాష్ట్ర సమితికి ఎనిమిది స్థానాలు లభిస్తాయని అంచనా వేసిందీ లోక్ పోల్. బీజేపీ ఆరు చోట్ల విజయం సాధిస్తుంది. కాంగ్రెస్ 3, ఎంఐఎం ఒక స్థానాన్ని గెలుచుకుంటుంది. కర్ణాటకలో బీజేపీ-15, కాంగ్రెస్-13, కేరళలలో కాంగ్రెస్ 15, ఇతరులు 5 సీట్లను గెలుస్తారు. ఎప్పటిలాగే ఈ రాష్ట్రంలో బీజేపీ ఖాతా తెరవబోదని స్పష్టం చేసింది లోక్ పోల్ సర్వే. తమిళనాడులో కూడా బీజేపీకి ఒక్క స్థానం కూడా దక్కదు. కాంగ్రెస్ ఏడు చోట్ల విజయం సాధిస్తుంది. డీఎంకే 24 స్థానాలను తన ఖాతాలో వేసుకుంటుంది.












Click it and Unblock the Notifications