ఓడినా.. వైఎస్ జగన్ అదే పాత రాజకీయం?
Lok Sabha Speaker: నేడు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరుగనుంది. ఈ ఉదయం 11 గంటలకు ఓటింగ్ ఆరంభమౌతుంది. ఇప్పటివరకు ప్రమాణ స్వీకారం చేయని సభ్యులు మినహా మిగిలిన వారందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కొత్త స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు.
స్పీకర్ పదవి కోసం ఎన్నిక జరగడం లోక్‌సభ చరిత్రలో ఇదే తొలిసారి. ఇప్పటివరకు పని చేసిన స్పీకర్లు అందరూ నామినేట్ అయిన వాళ్లే. ఈ దఫా మాత్రం దీనికి భిన్నంగా ఓటింగ్ జరగబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియాకు డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వడానికి ఎన్డీఏ నిరాకరించడంతో ఈ ఎన్నిక అవసరమైంది.

18వ లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా నామినేషన్ దాఖలు చేశారు. 17వ లోక్‌సభకు ఓం బిర్లా స్పీకర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ఆయననే కొనసాగించాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. వివాదరహితుడు కావడం, స్పీకర్ హోదాలో సమన్యాయాన్ని పాటించారనే సదభిప్రాయం ఓం బిర్లాపై ఉండటమే కారణమని చెబుతున్నారు.
మొన్నటి ఎన్నికల్లో రాజస్థాన్‌లోని కోటా-బూందీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించారు ఓం బిర్లా. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌కు చెందిన ప్రహ్లాద్ గుంజాల్‌ను 41 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు.
అదే సమయంలో అనూహ్యంగా ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా తెరమీదికి వచ్చింది. తమ తరఫున అభ్యర్థిని నిలబెట్టింది. కొడికున్నిల్ సురేష్‌ను లోక్‌సభ స్పీకర్ పదవి కోసం రేసులో నిలిపింది. ఫలితంగా- స్పీకర్ పదవి కోసం ఎన్నిక తప్పనిసరి అయింది. ఎన్డీఏకు ధీటుగా లోక్‌సభలో తమకు కూడా బలం ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది ఇండియా. తటస్థంగా ఉంటూ వచ్చిన పార్టీలు సైతం తమకు మద్దతు ఇస్తాయని ఆశిస్తోంది.
ఈ క్రమంలో- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటనేది చర్చనీయాంశమౌతోంది. గతంలో బీజేపీకి అన్ని రకాలుగా మద్దతు ఇచ్చింది వైఎస్ఆర్సీపీ. లోక్‌సభలో గానీ రాజ్యసభలో గానీ ఎన్డీఏ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుపైనా స్పందించింది. సీఏఏ వంటి వివాదాస్పద బిల్లులను పక్కనపెడితే దాదాపుగా అన్నింటికీ మద్దతు ఇచ్చింది. ఎన్డీఏకు అనుకూలంగా ఓటు వేసింది వైఎస్ఆర్సీపీ.

ఎన్డీఏలో చేరకపోయినా, బీజేపీతో ఎలాంటి పొత్తూ లేకపోయినా బయటి నుంచి మద్దతు ఇస్తూ వచ్చింది. రాష్ట్రపతి ఎన్నిక సమయంలో కూడా ఎన్డీఏ నిలబెట్టిన ద్రౌపది ముర్ముకు మద్దతు ఇచ్చింది. ఆమెకు అనుకూలంగా వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులు ఓటు వేశారు.
ఇప్పుడా పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీతో జట్టు కట్టింది బీజేపీ. టీడీపీని ఎన్డీఏలోకి మళ్లీ చేర్చుకుంది. ఇప్పుడు స్పీకర్ ఎన్నిక సమయంలో వైఎస్ఆర్సీపీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం ఆ పార్టీకి లోక్‌సభలో నలుగురు సభ్యులు ఉన్నారు.
ఈ ఎన్నికల్లో ఎన్డీఏ వైపే జగన్ మొగ్గు చూపారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటిదాకా తన ఆలోచన ఏమిటనేది అధికారికంగా వెల్లడించలేదు వైఎస్ఆర్సీపీ. బీజేపీ అభ్యర్థి ఓం బిర్లాకే ఓటు వేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. కేంద్రంతో ఘర్షణ వైఖరికి వెళ్లకూడదని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications