బంగాళాఖాతం అంచుల్లో గాల్లో తేలిన అనుభూతి- మన వైజాగ్ లోనే!!
విశాఖపట్నంలో అత్యంత పొడవైన కాంటిలివర్ గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జి త్వరలో ప్రారంభం కానుంది. దేశంలోనే అత్యంత పొడవైన గ్లాస్ బ్రిడ్జి ఇది. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ సుమారు ఏడు కోట్ల రూపాయల వ్యయంతో కైలాసగిరి కొండపైన ఈ ప్రాజెక్టును చేపట్టింది. ప్రస్తుతం దీనికి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ స్కైవాక్ బ్రిడ్జి.. గాల్లో తేలుతున్న అనుభూతిని ఇస్తుంది. విశాఖ సిటీ, బంగాళాఖాతం, చుట్టూ ఉన్న కొండల అందాలను ఆస్వాదించవచ్చు
ప్రైవేట్-పబ్లిక్ భాగస్వామ్యం పద్ధతిలో వీఎంఆర్డీఏ ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసింది. భూమి నుండి సుమారు 862 అడుగులు అంటే దాదాపుగా 262 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ స్కైవాక్ నిర్మితమౌతోంది. దీని పొడవు మొత్తం 55 మీటర్లు. హుద్‌హుద్ వంటి తుఫానులను దృష్టిలో ఉంచుకొని- గంటకు 250 కిలో మీటర్ల ఈదురు గాలిని సైతం తట్టుకునేలా రూపొందించారు. దీని నిర్మాణంలో టఫ్‌నెడ్ గ్లాస్‌ను ఉపయోగించారు. సుత్తితో కొట్టినా పగలదు.

ఒకేసారి 100 మంది దీనిపై నిల్చోవచ్చు. భద్రతపరంగా, స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జిపై రద్దీని నివారించడంలో భాగంగా 40 మంది వరకు సందర్శకులను మాత్రమే అనుమతిస్తారు. ఒక బ్యాచ్ తర్వాత మరో బ్యాచ్ వెళ్లేలా ప్లాన్ చేశారు. దీని నిర్మాణం పూర్తి కావడానికి దాదాపు ఎనిమిది నెలలు పట్టింది. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం అడ్వెంచర్ స్పోర్స్ కు కేంద్రంగా మారుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి.
ఒకవైపు అంతు లేని బంగాళాఖాతం, మరో వైపు పచ్చదనాన్ని పంచే తూర్పు కనుమలు, ఇంకో దిక్కున విశాఖ సిటీ.. ఇలా అన్నీ స్పష్టంగా కనిపించేంత ఎత్తులా ఈ స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించాలనే ఉద్దేశంతో దీన్ని నిర్మించామని వీఎంఆర్డీఏ తెలిపింది.
ఈ ప్రాజెక్టు కేరళకు చెందిన భారత్ మాతా వెంచర్స్, వైజాగ్‌కు చెందిన SSM షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ భాగస్వామ్యాన్ని తీసుకుంది వీఎంఆర్డీఏ. కేరళలోని వాగమాన్ గ్లాస్ బ్రిడ్జిని నిర్మించిన అనుభవం భారత్ మాతా వెంచర్స్‌కు ఉంది. దాని పొడవు 38 మీటర్లే. కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జి పొడవు 55 మీటర్లు. భద్రత కోసం జర్మన్ గ్లాస్ ప్యానెల్‌లను వినియోగించినట్లు ఈ సంస్థ ఎండీ జోమీ పూనూలి తెలిపారు. ఈ గ్లాస్ 40 మిల్లీ మీటర్ల మందంతో గల 3- లేయర్ ట్యాంపర్డ్ లామినేటెడ్ గ్లాస్‌తో తయారైందని అన్నారు.












Click it and Unblock the Notifications