బీ అలెర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. ఏపీలోని ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాల రాక ఊపందుకుంది. ఇవి కేరళ వైపు అతివేగంగా దూసుకొస్తున్నాయి. ఈ కారణంగా ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని IMD పేర్కొంది. నైరుతి రుతుపవనాలు ఈ నెల 23 లేదా 24న కేరళను తాకనున్నాయి. ప్రస్తుతం దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, లక్షద్వీపుల దగ్గర నైరుతీ రుతుపవనాలు ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
నైరుతి రుతుపవనాల కారణంగా ఏపీలో అతి భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రుతుపవనాలు ఈ నెల 23 లేదా 24న కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ నెల 26 నాటికి రాయలసీమ మీదుగా రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
సాధారణంగా జూన్ 1 తర్వాత నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయి. కానీ ఈ ఏడాది అంతకంటే ముందే కేరళకు రుతుపవనాలు రానున్నాయని అధికారులు తెలిపారు. గతేడాది కూడా ఇదే సమయంలో రుతుపవనాలు కేరళ, ఈశాన్య రాష్ట్రాలను తాకినట్లు వెల్లడించారు. ఇలా ఒకేసారి రుతుపవనాలు కేరళ తీరం, ఈశాన్య ప్రాంతాలను తాకడం చాలా అరుదని.. ఈ ఏడాది అలా జరగబోతోందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. 2017లోనూ ఇలాంటి సందర్భమే ఎదురైందని పేర్కొన్నారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. బుధవారం డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా, పశ్చిమ గోదావరి, నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో అతి భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది.

అటు తెలంగాణలోనూ ఈ నెల 24 వరకూ ఉదయం చల్లబడి ఉంటుంది.. సాయంత్రానికి హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాత్రివేళల్లో అధిక వర్షం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది.
మరో వైపు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గాయి. గత రెండు రోజులుగా తెలంగాణలో 32 నుంచి 34 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. రామగుండం, ఆదిలాబాద్, జగిత్యాలలో 35 డిగ్రీల సెల్సియస్ ఉంటోంది. ఏపీలో 30 నుంచి 31 డిగ్రీల సెల్సియస్ ఉంటోందని అధికారులు తెలిపారు. తిరుపతి, చిత్తూరు సహా తూర్పు రాయలసీమలో మాత్రం 33 డిగ్రీల సెల్సియస్ ఉంటోందన్నారు.












Click it and Unblock the Notifications