వార్ ఎఫెక్ట్ :నిలిచిన సిలిండర్ల సరఫరా- బుకింగ్, వినియోగం పై తాజా ఆంక్షలు..!!
వంట గ్యాస్ పై యుద్ద ప్రభావం పడింది. వంట గ్యాస్ ధరలను పెంచిన ఆయిల్ కంపెనీలు.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి. వంట గ్యాస్ బుకింగ్ తో పాటుగా సరఫరా విషయం లోనూ కొత్త నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఈ తాజా నిబంధనలతో వినియోగదారుల్లో కొత్త ఆందోళన మొదలైంది. వంట గ్యాస్ సరఫరా పరోక్షంగా ధరల పైనా ప్రభావం చూపుతోంది. దీంతో.. రానున్న రోజుల్లో ఈ సమస్య ఎటు టర్న్ తీసుకుంటుందో అనే ఆందోళన మొదలైంది.
యుద్దం కారణంగా ఆయిల్ కంపెనీలు వంట గ్యాస్ ధరలను పెంచాయి. ఇళ్లలో వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ పైన రూ.60, వాణిజ్య సిలిండర్ పైన రూ.115 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. కాగా, ఇదే సమయంలో వంట గ్యాస్ కొరత నేపథ్యంలో వాణిజ్య సిలిండర్ల సరఫరా పైన ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో.. చిరు వ్యాపారులకు వంటగ్యాస్ కష్టాలు మొదలు అయ్యాయి. గృహ వినియోగ సిలిండర్లు మాత్రమే సరఫరా చేయాలని కేంద్ర పెట్రోలియం మంత్రి త్వ శాఖ ఇంధన సంస్థలకు సూచించిన నేపథ్యంలో వాణిజ్య వినియోగ గ్యాస్ సిలిండర్ల సరఫరా దాదాపు నిలిచింది. నిత్యావసర వస్తువుల చట్టం కింద కేంద్రం ఈ ఆదేశాలు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చిరు వ్యాపారులు, హోటళ్లకు సిలిండర్ల సరఫరా నిలిచింది. ప్రస్తుతం గృహ వినియోగ సిలిండర్ల బుకింగ్ మాత్రమే కొనసాగుతోందని డీలర్లు సమాధానం ఇస్తున్నారు.

బుకింగ్ పైన ఆయిల్ కంపెనీల తాజా మార్గదర్శకాలు
కాగా.. కేంద్రం ఈ పరిస్థితి పైన నిరంతరం సమీక్ష చేస్తోంది. వంట గ్యాస్ కొరత రాకుండా కేంద్రం చర్యలు చేపట్టింది. ఆయల్ కంపెనీలకు వంట గ్యాస్ విక్రయించాలని స్పష్టం చేసింది. వంట గ్యాస్ గృహ వినియోగదారులకు మాత్రమే చేరేలా చూడాలని సూచించింది. దీంతో.. పెట్రో కెమి కల్, ఇతర అనుబంధ ఉత్పత్తుల తయారీకి మళ్లించకూడదని స్పష్టం చేస్తూ ఉత్తర్వుల్ని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇంధన కంపెనీల్లో వాణిజ్య సిలిండర్ల ఫిల్లింగ్‌ను నిలిపివేయగా గ్యాస్ ఏజెన్సీల పరిధిలో సరఫరాలో కొరత కనిపిస్తోంది. ఇదే సమయంలో వంట గ్యాస్ బుకింగ్ విధానంలోనూ మార్పులు తెచ్చారు. సింగిల్ సిలిండర్ ఉన్న వారు 21 రోజులు, డబుల్ సిలిండర్ ఉన్న వారు 30 రోజులకు గ్యాస్ తీసుకున్న తరువాత తిరిగి బుకింగ్ కోసం గడువుగా నిర్ణయించారు. ఈ మేరకు ఆయిల్ కంపెనీలు.. యాప్స్ తో పాటుగా పోర్టల్స్ లో సాఫ్ట్ వేర్ లో మార్పులు చేసారు. దీంతో.. యుద్దం మరింత కాలం కొనసాగితే.. వంట గ్యాస్ ఇబ్బందులు తప్పవనే ఆందోళన వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications