మనదేశంలో అతి పెద్ద రైల్వే జంక్షన్ ఏదో తెలుసా?
మనం రైల్లో ప్రయాణం చేస్తున్న సమయంలో అనేక స్టేషన్లు వస్తుంటాయి. వీటిల్లో కొన్ని జంక్షన్లు ఉంటాయి. జంక్షన్ అంటే అక్కడి నుంచి రెండు లేదా మూడు అంతకంటే ఎక్కువ మార్గాల్లో రైళ్లు చీలిపోయి వేర్వేరు మార్గాల్లో ప్రయాణిస్తాయి. అలాంటి స్టేషన్లకు పేరు చివర జంక్షన్ అని రాస్తారు. మన భారతదేశంలో అతి పెద్ద రైల్వే జంక్షన్ ఎక్కడ ఉందో తెలుసుకుందాం. ఎందుకంటే అక్కడి నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు రైళ్లు నడుస్తాయి. ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా అక్కడి నుంచి రైలులో చేరుకోవచ్చు.
మధురలో 10 ప్లాట్ ఫారాలు
సాధారణంగా దేశంలో అతి పెద్ద రైల్వే జంక్షన్ అనగానే చెన్నై, ముంబయి, ఢిల్లీ, కోల్ కతా లాంటి నగరాలు గుర్తుకు వస్తాయి. కానీ అవేవీ కావు. ఉత్తర మధ్య రైల్వే పరిధిలోని మధుర రైల్వే జంక్షన్ మన దేశంలో అతి పెద్ద రైల్వే జంక్షన్ గా పేరుగాంచింది. ఈ స్టేషన్ లో ఉన్న 10 ప్లాట్ ఫారాలగుండా రాత్రి, పగలు రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. మధుర జంక్షన్ నుంచి రైళ్లు ఏడు మార్గాల్లో చీలిపోతాయి.

దేశంలోని ప్రతి నగరానికి ఇక్కడి నుంచి అనుసంధానం ఉంది. 1875లో మొదటిసారిగా ఈ జంక్షన్ లో రైలుబండిని నడిపారు. మధుర నుంచి బృందావన్ వరకు 11 కిలోమీటర్ల పొడవైన మీటర్ గేట్ రైలు మార్గాన్ని ప్రారంభించిన తర్వాత క్రమేపీ ఇక్కడి నుంచి మార్గాలు పెరిగాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అతి పెద్ద జంక్షన్ గా మారింది.
మూడో స్థానంలో విజయవాడ
మధుర తర్వాత దేశంలో అతి పెద్ద రెండో రైల్వే జంక్షన్ సేలం. ఇది తమిళనాడులో ఉంది. ఇక్కడి నుంచి రైలు ఆరు మార్గాల్లో చీలిపోతుంది. సేలం తర్వాత విజయవాడ, బరేలీ జంక్షన్లు మూడోస్థానంలో నిలిచాయి. ఇక్కడి నుంచి రైళ్లు 5 మార్గాల్లో చీలిపోతాయి. అత్యధిక టికెట్లు అమ్ముడుపోయే స్టేషన్ గా మధుర పేరు తెచ్చుకుంది. ఈ జంక్షన్ కు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ అత్యాధునిక సౌకర్యాలను కల్పిస్తున్నారు. దేశంలోనే అత్యంత సుందరీకరణమైన స్టేషన్ గా తీర్చిదిద్దుతున్నారు.












Click it and Unblock the Notifications