మహా కుంభమేళాపై టీటీడీ నిర్ణయాలివే
Maha Kumbh Mela 2025: ఇంకొద్ది రోజుల్లో మహా కుంభమేళా 2025 ప్రారంభం కాబోతోంది. దీనికోసం- ఉత్తరప్రదేశ్‌లో చారిత్రాత్మక నగరం ప్రయాగ్‌రాజ్ ముస్తాబైంది. కోట్లాదిమంది భక్తుల కోసం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేసింది. కుంభమేళా సందర్శకుల కోసం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల నుంచి ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.
ఈ నెల 13వ తేదీన అంగరంగ వైభవంగా మహా కుంభమేళ ఆరంభం కాబోతోంది. ఫిబ్రవరి 26వ తేదీ వరకు కొనసాగుతుంది. అఘోరీ, నాగ, అఖండ్, అఖాడీ, నిరాకారీ.. వంటి సాధవులు ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్నారు. వేలాదిమంది సాధువులతో కిటకిటలాడుతోందీ ఆధ్యాత్మిక నగరి.

ఈ మహా కుంభమేళా సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా శ్రీవారి నమూనా ఆలయాన్ని నిర్మించింది ప్రయాగ్‌రాజ్‌లో. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా జనవరి 13 నుండి ఫిబ్రవరి 26వ తేది వరకు కోట్లాదిమంది భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించనుంది. ఈ ఆలయ నిర్మాణం దాదాపుగా పూర్తయింది.
ప్రయాగ్‌రాజ్‌లోని సెక్టార్ 6, భజరంగ్ దాస్ రోడ్డులో గల నాగవాసుకి ఆలయ సమీపంలో తిరుమల శ్రీవారి నమూనా ఆలయం నిర్మితమైంది. దీనికోసం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం 2.89 ఎకరాలను టీటీడీకీ కేటాయించింది. ఉత్తరాది భక్తులు శ్రీవారి వైభవాన్ని తిలకించడానికి వీలుగా తిరుమల తరహాలో స్వామివారి కైంకర్యాలు, ఉత్సవాలు నిర్వహించననున్నట్లు టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు వెల్లడించారు.
ప్రతిరోజు తిరుమల తరహాలో సుప్రభాతం నుండి ఏకాంత సేవ వరకు అన్ని సేవలను ఈ నమూనా ఆలయంలో నిర్వహిస్తారు. జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 12 తేదీలలో శ్రీవారి కల్యాణోత్సవాలను సైతం నిర్వహించడానికి కు ఏర్పాట్లు చేస్తోన్నామని శ్యామలరావు చెప్పారు.
మహా కుంభమేళాలో శ్రీవారి నమూన ఆలయ నిర్వహణ, భక్తుల సౌకర్యాల ఏర్పాటుకు టీటీడీ నుండి అర్చక స్వాములు, వేద పండితులు, వివిధ విభాగాల సిబ్బంది నేడు ప్రయాగ్ రాజ్‌కు బయలుదేరి వెళ్లారు. తిరుమల నుండి ప్రయాగ్‌రాజ్‌కు ఈ ఉదయం 7 గంటలకు శ్రీవారి కళ్యాణ రథం బయలుదేరింది.












Click it and Unblock the Notifications