మహా శివరాత్రి వేళ.. ప్రధాని మోడీకి శ్రీశైలం ఎలివేటేడ్ కారిడార్ ప్రతిపాదన!!
మహాశివరాత్రి వేళ ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం వంతెన మార్గం ( ఎలివేటెడ్ కారిడార్) ను నిర్మించాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ లేఖ రాశారు. శ్రీశైలం వెళ్ళాలి అంటే నల్లమల అటవీ ప్రాంతం నుండి వెళ్ళాలి. దాదాపు 62కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం నుండి ప్రయాణం చెయ్యాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో తాజాగా సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ. రమణ ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాయటం ప్రాధాన్యతను దక్కించుకుంది. దక్షిణ కాశీగా పేరు గాంచిన శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి మాత్రమే కాకుండా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా లక్షలాదిగా భక్తులు వస్తుంటారు. శ్రీశైలం చేరుకోవడానికి సరైన రవాణామార్గం లేని కారణంగా నల్లమల అటవీ ప్రాంతం నుండి ప్రయాణాన్ని సాగిస్తున్నారు.

ఇక శివరాత్రి వంటి పండుగల సీజన్లో అయితే భక్తులరద్దీ విపరీతంగా ఉంటుంది. నల్లమల అటవీప్రాంతంలో శ్రీశైలం వెళ్లేందుకు వేసిన రోడ్డు మార్గం 5.5 మీటర్ల నుంచి 7 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఈ ఇరుకుదారిలో ప్రతిరోజు భక్తులు రాకపోకలు సాగిస్తున్నారని సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ ఎన్వి రమణ మోడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. కాబట్టి భక్తుల సౌకర్యార్థం శ్రీశైలానికి వంతెన మార్గాన్ని నిర్మాణం చేయాలని తన లేఖలో విజ్ఞప్తి చేశారు.
శ్రీశైలం నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణులకు ఇబ్బంది కలిగిస్తూ, ఇరుకైన వంతెనలతో, లోయలు, మలుపులతో వాహన రాకపోకలు సాగించడం ఇబ్బందికరంగా ఉంటుందని, ఈ మార్గంలో పులుల సంరక్షణ కేంద్రం వెళ్తోందని కాబట్టి ఇక్కడ ఎలివేటెడ్ కారిడార్ ను ఏర్పాటు చేస్తే భక్తులకు సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా, వన్యప్రాణులకు కూడా ముప్పు తప్పుతుందని మాజీ జస్టిస్ ఎన్వి రమణ తన లేఖలో పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత చొరవతో వారణాసిలో కాశీ విశ్వనాధ కారిడార్ రూపుదిద్దుకుందని, మీరు చొరవ చూపితే దక్షిణ కాశి ప్రాజెక్టు కూడా సాకారం అవుతుందని ఆయన తన లేఖలో ప్రతిపాదించారు. ఈ అంశంపై గత ఫిబ్రవరిలో తాను లేఖ రాసినట్టు పేర్కొన్నారు.
అప్పుడు తన లేఖకు స్పందించిన కేంద్ర రహదారుల రవాణా శాఖ కార్యదర్శి నుండి ఈ రోడ్డు మార్గాన్ని మెరుగుపరచడానికి డి పి ఆర్ తయారీ కోసం కన్సల్టెంట్ నియమించినట్టు మే 24వ తేదీన తనకు సమాధానం వచ్చిందని తెలిపారు. అయితే ఎలివేటెడ్ కారిడార్ పై ప్రధాని నరేంద్ర మోడీ మరోమారు దృష్టి సారిస్తే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. శివరాత్రి సందర్భంగా ప్రధానమంత్రి కార్యాలయం తెలుగు రాష్ట్రాల భక్తులకు దీనిని ఒక బహుమతిగా ప్రకటిస్తే సంతోషంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఎన్వి రమణ.












Click it and Unblock the Notifications