పవన్ పర్యటనల వేళ- నారా లోకేష్ తీర్థయాత్ర
Mahakumbh 2025: మహా కుంభ మేళా 2025 వైభవంగా కొనసాగుతోంది. ప్రయాగ్‌రాజ్‌లో పండగ వాతావరణం నెలకొంది. దేశం నలుమూలల నుంచీ వస్తోన్న కోట్లాది మంది భక్తులు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ వద్ద గంగా-యమున-సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలను ఆచరిస్తోన్నారు. తమ మొక్కులు చెల్లించుకుంటోన్నారు. ఘాట్లన్నీ జనసంద్రం అవుతున్నాయి.
కిందటి నెల 13వ తేదీన మహా కుంభమేళా ఆరంభమైన విషయం తెలిసిందే. 45 రోజుల పాటు అంటే ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగబోతోందీ అతిపెద్ద ఆధ్యాత్మికోత్సవం. దేశ విదేశాల నుంచి కోట్లాదిమంది భక్తులు పుణ్యస్నానాలను ఆచరిస్తోన్నారు. త్రివేణి సంగమం ఘాట్లన్నీ కూడా పోటెత్తాయి.

మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం నాడు ఏకంగా రెండు కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరించడం అంటే మాటలు కాదు. సాయంత్రం 6 గంటల వరకు 1.90 కోట్ల మంది భక్తులు స్నానాలను ఆచరించనట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. రాత్రి వరకూ మరో 10 లక్షల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు.
జనవరి 13వ తేదీ నుంచి ఈ నెల 12వ తేదీ అంటే మంగళవారం వరకు 48 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలను ఆచరించారు. భక్తల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ప్రయాగ్‌రాజ్, త్రివేణి సంగమం ఘాట్లన్నింటినీ నో వెహికల్ జోన్‌గా ప్రకటించింది ప్రభుత్వం. ఘాట్లకు వెళ్లే మార్గాలన్నింట్లో వాహనాల రాకపోకలను నిషేధించింది.
కాగా- ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో భాగస్వామ్యులు కానున్నారు ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్, ఆయన భార్య బ్రాహ్మణి. ఈ నెల 17వ తేదీన ప్రయాగ్‌రాజ్‌కు బయలుదేరి వెళ్లనున్నారు నారా లోకేష్ దంపతులు. మహా కుంభమేళాలో భాగంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరించనున్నారు.
అనంతరం వారాణశీకి బయలుదేరి వెళ్లనున్నారు. కాశీ క్షేత్రపాలకుడైన మహా కాలభైరవేశ్వరుడి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తరువాత కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకుంటారు. విశ్వనాథుడి సన్నిధిలో ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు. వారణాశి ఘాట్‌లను సందర్శించి, గంగా హారతిలో పాల్గొనే అవకాశం ఉంది.
కాగా- ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో ఆలయ సందర్శన కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. మాఘ పౌర్ణమి సందర్భంగా బుధవారం ఆయన ఆలయ దర్శనానికి శ్రీకారం చుట్టారు. కేరళలోని అగస్తేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించారు. కుమారుడు అకీరా నందన్‌తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.












Click it and Unblock the Notifications