రాత్రికి రాత్రే లేకుండా చేస్తాం: బాబుకు మహేందర్, దాడి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తెలంగాణ రాష్ట్ర మంత్రి మహేందర్ రెడ్డి బుధవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయాన్ని కూల్చేంత ధైర్యం టీడీపీ నేతలకు లేదన్నారు. నల్గొండ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెరాస కార్యకర్తలు నిప్పు పెట్టిన విషయం తెలిసిందే. ఇది ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది.
తెరాస కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహేందర్ రెడ్డి బుధవారం సాయంత్రం మాట్లాడారు. చంద్రబాబు ఏం చెబితే తెలంగాణ టీడీపీ నేతలు అదే చేస్తున్నారని మండిపడ్డారు. తాము తలుచుకుంటే రాత్రికి రాత్రే తెలుగుదేశం పార్టీ కార్యాలయం లేకుండా చేస్తామని హెచ్చరించారు. అసలు చంద్రబాబుకు తెలంగాణలో ఏం పని అని ప్రశ్నించారు. పదేళ్లు ఉమ్మడి రాజధాని కాబట్టి తాము ఊరుకుంటున్నామని చెప్పారు.
తమను రెచ్చగొడితే ఎట్టి పరిస్థితుల్లోను ఊరుకునేది లేదని చెప్పారు. తెలంగాణ టీడీపీ నేతలకు తమ పార్టీ కార్యాలయాన్ని కూల్చేంత ధైర్యం లేదన్నారు. నిన్న ఎర్రబెల్లి దయాకర రావు మాట్లాడుతూ.. తెలంగాణ భవనాన్ని ఒక్క ఇటుక కూడా లేకుండా చేస్తామని చెప్పారని, అంత ఉంటే గేటు వద్దకు రావాలని సవాల్ చేశారు.

కాగా, అంతకుముందు నల్గొండ జిల్లా బంద్ నేపథ్యంలో జిల్లా కేంద్రానికి వెళుతున్న తెలంగాణ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, మోత్కుపల్లి నర్సింహులు, ఎల్ రమణ తదితరులను చిట్యాలలో అరెస్ట్ చేసి భువనగిరికి తరలించారు. పోలీస్ స్టేషనులో ఉన్న టీడీపీ నేతల వాహనాలపై తెరాస కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి.
ఈ ఘటనపై ఎర్రబెల్లి ధ్వజమెత్తారు. కేసీఆర్ ఒక గూండాలా వ్యవహరిస్తున్నారన్నారు. తెరాస నేతలు సంఘవిద్రోహ శక్తులన్నారు. తామంతా వెయ్యిమందికి పైగా ఉండగా, కేవలం 15 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు తమ వాహనాలపై దాడి చేశారన్నారు. ఇంతమంది పోలీసులు ఉన్నప్పటికీ అడ్డుకోలేదన్నారు. ప్రభుత్వం, పోలీసులు కలసి డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, రేషన్ కార్డులు, రైతుల ఆత్మహత్యలు ఇలా ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కేసీఆర్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదన్నారు. సమస్యలపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పాలన చేతకాక తమను టార్గెట్ చేశారన్నారు. దాడులు, విధ్వంసాలతో ప్రజల దృష్టిని మళ్లించాలని చూస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications