పవన్ కల్యాణ్ రికార్డును బద్ధలు కొట్టిన మహేష్ బాబు
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బిజినెస్‌మేన్ చిత్రం కొత్త రికార్డు సృష్టించింది.పవన్ కళ్యాణ్‌తో సహా ఇతర స్టార్ హీరోల సినిమాల కలెక్షన్స్‌ను అధిగమించి అగ్రస్థానంలో నిలిచింది. రీ రిలీజ్ లో తొలిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. మహేష్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకొని బిజినెస్ మేన్ చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు.
థియేటర్ల దగ్గర మహేష్ బాబు అభిమానుల కోలాహలంతో సందడి వాతావరణం నెలకొంది. 4కే డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో దీన్ని మళ్లీ విడుదల చేశారు. ఈ సినిమాపై ఉన్న క్రేజ్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ కోటిరూపాయలకు పైగా జరిగాయి. బుధవారం అగ్రహీరోల సినిమాలేవీ లేకపోవడంతో ఈ సినిమాకు భారీ సంఖ్యలో థియేటర్లు దొరికాయి. తొలిరోజే నాలుగు కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. నైజాం ఏరియాలోనే ఈ సినిమా రెండున్నర కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది.

సీడెడ్‌లో రూ.40 లక్షలు, ఉత్తరాంధ్ర లో రూ.42 లక్షలు, గుంటూరు రూ.35, కృష్ణాలో రూ.30 లక్షలు రాబట్టింది. మళ్లీ విడుదలైన సినిమాల్లో నైజాం ప్రాంతానికి సంబంధించి ఖుషి చిత్రం అత్యధిక కలెక్షన్లు రాబట్టింది. ఆ సినిమా రూ.1.65 కోట్లు వసూలు చేసింది. తాజాగా ఈ చిత్రం రికార్డును బిజినెస్ మేన్ బ్రేక్ చేసింది.
బిజినెస్ మేన్ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించగా కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించింది. 2012లో విడుదలైన ఈ చిత్రం ఆ ఏడాదిలో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. రూ.90 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. సూర్యాభాయ్ అనే గ్యాంగ్ స్టర్ పాత్రలో మహేష్ బాబు అద్భుతమైన నటన, మేనరిజమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.












Click it and Unblock the Notifications