ఎపికి ప్రత్యేక హోదానే మా ప్రధానాంశం, పార్లమెంటులో పోరు: మేకపాటి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించడమే తమ ఎజెండాలోని ప్రధానమైన అంశమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ఇదే విషయాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని ఆయన చెప్పారు.
హైదరాబాదులోని లోటస్‌పాండు పార్టీ కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. సమావేశానంతరం మేకపాటి రాజమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర విభజన సందర్భంగా ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. విభజన సందర్భంగా ఎపికి ఇచ్చిన హామీలను అన్నింటినీ ప్రభుత్వం అమలు చేయాల్సిందేనని, ఇందుకు తాము పట్టుపడుతామని ఆయన చెప్పారు.
ఇటీవలి వర్షాలతో రాష్ట్ర రైతులు తీవ్రంగా నష్టపోయారని, ధాన్యం మద్దతు ధర పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని ఆయన చెప్పారు. పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్ర సమస్యలన్నింటినీ తాము ప్రధానంగా ప్రస్తావిస్తామని మేకపాటి చెప్పారు.












Click it and Unblock the Notifications