నెల్లూరు వైసీపీలో బిగ్ ట్విస్ట్..! మళ్లీ ఏకమైన పాత ప్రత్యర్థులు..!
ఏపీలో రాజకీయంగా యాక్టివ్ గా ఉంటే జిల్లాల్లో ఒకటైన నెల్లూరులో రాజకీయాలు కూడా ఆ స్ధాయిలోనే ఉంటాయి. నేతలు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో, ఎప్పుడు ఎవరికి ఎవరు ప్రత్యర్థులుగా మారిపోతారో అంతుబట్టదు. అధికారం ఉన్నప్పుడు ఒకలా, అధికారం పోయిన తర్వాత మరోలా ఉండటంలోనూ ఇక్కడి నేతలు ముందుంటారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా పనిచేసి, ప్రత్యర్థులుగా మారిన ఓ ఇద్దరు ఇప్పుడు తిరిగి ఏకమయ్యారు.
నెల్లూరు జిల్లాలో మంత్రులుగా పనిచేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరూ వైసీపీ అధినేత జగన్ కు సన్నిహితులే. వీరిద్దరిలో ఎవరినీ ఆయన వదులుకునే పరిస్ధితి లేదు. అయినా సమీకరణాల్లో భాగంగా వీరిలో ఒకరికే మంత్రి పదవి ఇచ్చే పరిస్ధితి ఉండటంతో ముందుగా జగన్ అప్పట్లో అనిల్ కుమార్ యాదవ్ ను మంత్రిని చేశారు. అప్పటి నుంచి రగిలిపోయిన కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎట్టకేలకు జగన్ కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కించుకున్నారు.

అప్పటి నుంచీ వీరిద్దరి మధ్య ఉన్న వైరం ఇంకా ముదిరింది. ఈ విషయంలో స్వయంగా జగన్ నచ్చజెప్పినా సరే అప్పట్లో ఇద్దరూ వినే పరిస్ధితి లేదు. అనంతరం రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయినా వీరిద్దరి మధ్య వైరం మాత్రం కొనసాగింది. అయితే కూటమి సర్కార్ కాకాణితో పాటు అనిల్ యాదవ్ నూ కేసులతో టార్గెట్ చేయడంతో ప్రత్యర్థులు కాస్తా తిరిగి ఏకమయ్యారు. మైనింగ్ కేసుల్లో అరెస్టు అయి మూడు నెలలుగా జైల్లో ఉన్న కాకాణి తాజాగా విడుదల కావడంతో అనిల్ ఆయన్ను పరామర్శించారు.

మరోవైపు అనిల్ యాదవ్ పైనా ఇప్పుడు కేసులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపు అనిల్ ను అరెస్టు చేసినా ఆశ్చర్యం లేదు. ఇలాంటి పరిస్ధితుల్లో కాకాణిని కలిసి ఆయన పరామర్శించడం వ్యూహాత్మకమే అన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఏదేమైనా జగన్ చెప్పినా వినకుండా ఎవరికి వారే రాజకీయాలు చేసిన వీరిద్దరిని ఇప్పుడు కూటమి సర్కార్ పెట్టిన కేసులు కలిపినట్లే కనిపిస్తోంది. ఇదంతా అంతిమంగా వైసీపీ క్యాడర్ లో మాత్రం సంతోషం నింపుతోంది.












Click it and Unblock the Notifications