3గంటలు ప్రశ్నించారు: మల్లాది విష్ణు, ఛీ! ప్రతిదానికి లాబీయింగ్ చేయాలి: నాని ధ్వజం
విజయవాడ: కల్తీ మద్యం కేసులో ఏర్పాటైన ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్) తనను మూడు గంటల పాటు విచారించిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లాది విష్ణు గురువారం తెలిపారు. రెండో రోజు విచారణ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
స్వర్ణ బార్‌లో విష ప్రయోగం జరిగిందని అనుమానిస్తున్నామని అధికారులు తనతో విచారణలో చెప్పారన్నారు. అయితే అందుకు గల కారకులెవరో తేల్చాలని సిట్‌కు చెప్పానని అన్నారు. కారకులు ఎవరో తెలుసుకునేందుకు తాము ప్రయత్నిస్తున్నామని సిట్ చెప్పిందన్నారు.
ఏం చేశారని: కేశినేని నాని ఆగ్రహం
రైల్వే అధికారులు గతంలోను ఇలాగే సమావేశాలు పెట్టారని, కానీ ఇప్పటి వరకు ఏం అమలు కాలేదని ఎంపీ కేశినేని నాని అన్నారు. విజయవాడలో రైల్వే అధికారులతో ఎంపీల భేటీ రసాభాస అయిన విషయం తెలిసిందే. అనంతరం కేశినేని నాని విలేకరులతో మాట్లాడారు.

గత ఏడాది ఇచ్చిన హామీలు ఎంత వరకు నెరవేర్చారని రైల్వే అధికారులను అడిగితే చెప్పలేకపోయారన్నారు. రూ.20వేల కోట్లు ఇచ్చామని చెబుతున్నారని, అవి సాంక్షన్ చేశామంటూన్నారని, కానీ ఖర్చు లెక్కలు వేస్తే రూ.250 కోట్లే వస్తున్నాయన్నారు. నిధులు లేకుంటే సమావేశాలు ఎందుకన్నారు.
కాగా, రైల్వే జీఎంతో ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సమావేశం హాట్ హాట్‌గా జరిగింది. ప్రతి అంశాన్ని రైల్వే బోర్డుపైన నెట్టేస్తున్నారని జిఎం పైన జెసి దివాకర్ రెడ్డి, గల్లా జయదేవ్, కేశినేని నాని తదితరులు మండిపడ్డారు. ఉపయోగం లేని సమావేశాలు అంటూ కొందరు మధ్యలోనే వచ్చారు. వైసిపి ఎంపీలు సమావేశంలోనే ఉన్నారు.
ప్రతి విషయానికి కేంద్రం దగ్గర లాబీయింగ్ చేయాల్సి వస్తోందని ఎంపీ కేశినేని నాని అసంతృప్తి వెళ్లగక్కారు. ఏపీకి రైల్వే శాఖ చేయాల్సిన ఎన్నో పనులు పెండింగులో ఉన్నాయన్నారు. రైల్వేలలో నిధులు లేవంటున్నప్పుడు సమావేశం ఏ ఉద్దేశంతో నిర్వహించారన్నారు. మచిలీపట్నం రైల్వే లైన్, ఏపీకి రైల్వే జోన్, వివిధ మార్గాల్లో పెండింగులో ఉన్న ఇతర పనుల గురించి రైల్వే జీఎంను తాము నిలదీసినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications