హత్య కేసులో వైసీపీ మాజీ ఎంపీకి షాక్, వీకెండ్ లో పోలీసు కస్టడీకి
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను కస్టడీలోకి తీసుకొని విచారణ చేయడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో వెలగపూడిలో మరియమ్మ అనే మహిళ హత్యకు గురైయ్యింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే మరియమ్మ హత్యకు గురి కావడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసు కేసు పెట్టారు. అప్పట్లో బాపట్ల సిట్టింగ్ ఎంపీగా ఉన్న నందిగం సురేష్ రెచ్చగొట్టడంవలనే మరియమ్మ హత్యకు గురైయ్యిందని ఆరోపణలు ఉన్నాయి.
ఆ సమయంలో మరియమ్మ కుటుంబ సభ్యులు వైసీపీ నాయకుడు నందిగం సురేష్ తో పాటు కొంతమంది మీద కేసు పెట్టారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటం, అదే పార్టీకి చెందిన నందిగం సురేష్ బాపట్ల ఎంపీ గా ఉండటంతో ఆయన మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొంతకాలానికి మరియమ్మ కుటుంబ సభ్యులకు కూడా ఏమి చేయలేని పరిస్థితిలో సైలెంట్ గా ఉండిపోయారు.

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకుల పరిస్థితులు తారుమారు అయ్యాయి. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో నందిగం సురేష్ పేరు కూడా ఉంది. ఈ కేసులో అరెస్టు చేస్తారనే భయంతో కొన్ని నెలల క్రితం నందిగం సురేష్ పారిపోయాడు. గత నెలలో హైదరాబాద్ లోని రహస్య ప్రాంతంలో తలదాచుకున్న నందిగం సురేష్ ను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. అప్పటినుండి సెంట్రల్ జైల్లో ఉన్న నందిగం సురేష్ కి ఆ కేసులో బెయిల్ వచ్చింది.
అయితే ఆ కేసులో జైలు నుండి బయటకు రావాలని ప్రయత్నించిన నందిగం సురేష్ కు పోలీసులు షాక్ ఇచ్చారు. మరియమ్మ హత్య కేసులో పీటీ వారెంట్ పై నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మరియమ్మ హత్య కేసులో నందిగం సురేష్ ను మరోసారి సెంట్రల్ జైలుకు తరలించారు. రిమాండ్ ఖైదీగా గుంటూరు సెంట్రల్ జైల్లో ఉన్న నందిగం సురేష్ ను విచారణ చేసి వివరాలు తెలుసుకోవడానికి తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

నందిగం సురేష్ ను విచారం చేయడానికి మంగళగిరి కోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు అనుమతి ఇవ్వడంతో గుంటూరు సెంట్రల్ జైలులో ఉన్న వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను కస్టడీలోకి తీసుకుని తూళ్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. తుళ్లూరు పోలీస్ స్టేషన్ లోనే రెండు రోజులపాటు నందిగం సురేష్ ను పోలీసులు విచారణ చేసి మరియమ్మ హత్య కేసు కు సంబంధించిన వివరాలు బయటకు లాగాలని డిసైడ్ అయ్యారు.
రెండు రోజులు మాత్రమే నందిగం సురేష్ ను విచారణ చేయడానికి కోర్టు అనుమతి ఇవ్వడంతో సోమవారం సాయంత్రం లోపు వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను మళ్లీ గుంటూరు సెంట్రల్ జైలుకు పంపించాలి. మొత్తం మీద వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసు కస్టడీకి ఇవ్వడంతో పోలీసుల విచారణలో ఆయన ఎలాంటి విషయాలు బయట పెడతారో అని వైసీపీ కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications