బండ్ల గణేష్ మళ్లీ ఏసేశాడు..!!
అమరావతి: మార్గదర్శి చిట్ ఫండ్ కేసు విషయంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్‌లో ఉన్న మార్గదర్శి ఛిట్ ఫండ్ కార్యాలయంలో సోదాలను నిర్వహించడంపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడాన్ని విజయసాయి రెడ్డి తాజాగా తప్పు పట్టారు. ఈ విషయంలో ఆయన ఆ సంస్థ ఛైర్మన్ రామోజీ రావుపై విమర్శలు గుప్పించారు.

సోదాలపై..
మార్గదర్శి ఛిట్ ఫండ్ కేసు విషయంలో ఏపీ ప్రభుత్వం ఇదివరకే ఇంప్లీడ్ అయిన విషయం తెలిసిందే. దీన్ని మంచి పరిణామంగా కాంగ్రెస్ మాజీ లోక్‌సభ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అప్పట్లో అభివర్ణించారు. దీని తరువాత- ఇదే కేసులో మార్గదర్శి ఛిట్ ఫండ్ కార్యాలయాల్లో సోదాలను నిర్వహించడానికి విజయవాడ జిల్లా సబ్ రిజిస్ట్రార్ ఈ నెల 13వ తేదీన వారంట్‌ను జారీ చేసింది. ఈ వారంట్‌ను సవాల్ చేస్తూ మార్గదర్శి ఛిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.

స్టే పై..
అత్యవసర విచారణ పిటీషన్‌ను దాఖలు చేసింది. దీనిపై విచారణలను విన్న అనంతరం హైకోర్టు మధ్యంతర స్టేను జారీ చేసింది. దీన్ని విజయసాయి రెడ్డి తాజాగా తప్పు పట్టారు. సోదాలను నిర్వహించడానికి అధికార యంత్రాంగం ప్రయత్నించినా, అందుకు తగిన సమాచారాన్ని అడిగినా స్టేలను తెచ్చుకుంటావని ఆరోపించారు. తన కార్యాలయంలో చోటు చేసుకున్న అక్రమాలపై సంబంధిత శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తే కోర్టుకెళ్తావని మండిపడ్డారు.

సాయిరెడ్డి హితబోధ..
మళ్లీ పారదర్శకత, ప్రజాస్వామ్యం అంటూ నీతులు చెబుతుంటావని రామోజీ రావును విమర్శించారు విజయసాయి రెడ్డి. ఏ తప్పూ చేయకపోతే ధైర్యంగా విచారణను ఎదుర్కోవాలని హితబోధ చేశారు. అప్పుడే బాగోతాలు తేలుతాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఈ మధ్యాహ్నం ట్వీట్ చేశారు.

పాతిక వేల కుటుంబాలు..
దీనికి టాలీవుడ్ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. తనకు తెలిసినంత వరకు మార్గదర్శి ఛిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ రామోజీ రావు 25 వేల కుటుంబాలకు ప్రతి నెలా జీవనోపాధిని కల్పిస్తోన్నారని గుర్తు చేశారు. కొన్ని సంవత్సరాలుగా ఆయా కుటుంబాల వారు రామోజీ రావు ఛైర్మన్‌గా వ్యవహరిస్తోన్న సంస్థలపై ఆధారపడి జీవనోపాధిని పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆతృతతో చెబుతున్నానంటూ బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు.

కొత్తేమీకాదు..
విజయసాయి రెడ్డి పోస్ట్ చేసిన ట్వీట్లకు బండ్ల గణేష్ కౌంటర్ అటాక్‌కు దిగడం కొత్తేమీ కాదు. ఇదివరకు కూడా ఇలానే స్పందించారాయన. రాహుల్ గాంధీని కలిసినవారందరూ ఎల్లో మీడియానే అంటూ అప్పట్లో సాయిరెడ్డి చేసిన ట్వీట్‌కు బండ్ల గణేష్ ఘాటుగా స్పందించారు. ఆచార్య హరగోపాల్, గద్దర్, ఆచార్య ఇటిక్యాల పురుషోత్తం, కంచె ఐలయ్య, చెరుకు సుధాకర్, జహీర్ ఆలీఖాన్‌లు రాహుల్‌ను కలిశారని, వారు కూడా ఎల్లో మీడియానేనా? అంటూ ప్రశ్నంచారు.












Click it and Unblock the Notifications