పవన్ మేలు కోరిన జగన్- అన్నీ మరిచి
YS Jagan: జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్.. సింగపూర్ పాఠశాలలో సంభవించిన అగ్నిప్రమాదంలో గాయపడిన ఘటన.. రెండు తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. అటు రాజకీయ నాయకులు, ఇటు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోన్నారు. ఈ ఘటనపై ఆరా తీస్తోన్నారు.
సింగపూర్ రివర్ వ్యాలీ రోడ్‌లో మూడంతస్తుల భవనం సోప్‌హౌస్‌లో గల టమాటో కుకింగ్ స్కూల్‌లో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. చిన్న పిల్లల కోసం కుకింగ్ లెసన్స్ బోధించడం, దానికి అనుగుణంగా క్యాంప్ నిర్వహిస్తోన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో మార్క్ శంకర్ పవనోవిచ్ సహా 20 మంది విద్యార్థులు ఉన్నారు.

సమాచారం అందిన వెంటనే సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్సెస్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నాయి. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. మూడు అగ్నిమాపక శకటాలు మంటలను ఆర్పివేశాయి. ఈ ఘటనలో సోప్ హౌస్ బిల్డింగ్ రెండు, మూడో అంతస్తు పూర్తిగా దగ్ధమైంది.
ఈ ఘటనలో గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తోన్నారు. మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు కాలిన గాయాలయ్యాయని పెదనాన్న చిరంజీవి వెల్లడించారు. శంకర్ ఆరోగ్యం బాగుందని, కోలుకుంటోన్నాడని వివరించారు. దీనితో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఈ ముగ్గురూ తమ అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ పెశారు.
I am shocked to know about the fire accident at a school in Singapore in which @PawanKalyan garu's son, Mark Shankar got injured. My thoughts are with the family in this difficult time. Wishing him a swift and complete recovery.
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 8, 2025
సింగపూర్ స్కూల్‌లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడిన విషయం ఆందోళన కలిగించిందని చంద్రబాబు, నారా లోకేష్ చెప్పారు. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్ధిస్తున్నానట్లు పేర్కొన్నారు.
అగ్ని ప్రమాదం ఘటన తెలిసిన వెంటనే షాక్‌కు గురయ్యానని వైఎస్ జగన్ అన్నారు. పవన్ కల్యాణ్ తనయుడు మార్క్ శంకర్ గాయపడటం బాధించిందని చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో పవన్ కల్యాణ్ కుటుంబానికి మేలు జరగాలని, మార్క్ శంకర్ శరవేగంగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications