నాలుగురోజుల్లో పెళ్లి.. కానీ అంతలోనే ఘోరం జరిగిపోయింది!
మరో నాలుగు రోజుల్లో పెళ్లి చేసుకుని అత్తవారింట్లో అడుగుపెట్టాల్సిన ఆ యువతికి అప్పుడే నూరేళ్లు నిండిపోయాయి. పెళ్లి బట్టలు కొనుక్కుని హైదరాబాద్ నుంచి తిరిగి వస్తూ కారు బోల్తా పడిన దుర్ఘటనలో కన్నుమూసింద
గద్వాల: పెళ్లికూతురుగా ముస్తాబై అత్తారింట్లో అడుగు పెట్టేందుకు ఇక నాలుగు రోజులే మిగిలున్నాయి. ఒకవైపు పెళ్లిపనులు చకచకా జరుగుతున్నాయి.. బంధువులు వివాహానికి రావడానికి సిద్ధమవుతున్నారు. కుటుంబసభ్యులు హైదరాబాద్‌కు వెళ్లి పెళ్లిబట్టలు తీసుకొని బయల్దేరారు.
పదినిమిషాలైతే క్షేమంగా ఇంటికి చేరుకునేవారు. ఈ కథ మరోలా ఉండేది. కానీ అంతలోనే ఘోరం జరిగిపోయింది. ఆ కుటుంబంలో తీరని విషాదం మిగిలింది. వారు ప్రయాణిస్తున్న కారు బోల్తాపడడంతో కాబోయే పెళ్లికూతురు దుర్మరణం పాలైంది. ఈ ఘటన ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బతీసింది.

గద్వాల పట్టణంలోని నల్ల కుంట వీధికి చెందిన బానుజీ, ఎగ్బాల్ దంపతుల కూతురు రజియాబేగ (24)కు కర్ణాటక రాష్ట్రం మాన్వి గ్రామానికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది.
ఈనెల 14న పెళ్లి చేయడానికి ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. పెళ్లికూతురు వస్త్రాలు, ఆభరణాల కోసం కుటుంబసభ్యులు మంగళవారం హైదరాబాద్‌కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రాజియాబేగంతోపాటు అబ్దుల్ రెహమాన్, మోయిన్, మహ్మద్ మస్తాన్‌లు కారులో బయల్దేరారు. 10 నిమిషాలైతే ఇంటికి చేరుకునేవారు.
కారు వీరాపూర్ సబ్‌స్టేషన్ వద్దకు రాగానే కారు డ్రైవర్ బాషా ఎదురుగా ఉన్న డివైడర్‌ను గమనించలేదు. దీంతో వేగంగా వస్తున్న వాహనం డివైడర్‌ను ఢీ కొట్టి అమాంతం గాలిలో ఎగిరి రోడ్డుమీద పల్టీలు కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను గద్వాల జిల్లా ఆస్పత్రికి తరలించారు.
అయితే క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూల్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యం అందుతుండగా పెళ్లికూతురు రజియాబేగం బుధవారం ఉదయం మరణించింది. మిగిలిన నలుగురి పరిస్థితి విషమంగానే ఉంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్టు రూరల్ ఇన్‌చార్జ్ ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు.
కోలుకోలేని విషాదం
ఈ సంఘటనతో బాధిత కుటుంబంలో విషాదం అలుముకుంది. సంతోషంగా పెళ్లి చేసుకుని అత్తవారింట్లో ఉండాల్సిన కూతురు ఈ లోకాన్నే విడిచిపోయిందనే వార్త తెలిసి రజియాబేగం తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వారి రోదనలను ఎవరూ ఆపలేకపోయారు. పెళ్లికి రావాల్సిన బంధువులు చావు వార్త విని నమ్మలేకపోయారు. ఈ సంఘటన విన్నవారందరూ కంటతడి పెట్టారు.












Click it and Unblock the Notifications