ప్రాణాలు పోయాకే: క్రాసింగ్ వద్ద రైల్వేగేట్ ఏర్పాటు(ఫొటో)
మెదక్: రైల్వేగేటు, కాపలా లేని లెవల్ క్రాసింగ్ కారణంగా పదహారు మంది బడి పిల్లలు చనిపోయాక గానీ రైల్వే అధికారులు కళ్లు తెరవలేదు. చిన్నారుల ప్రాణాలను బలిగొన్న మెదక్ జిల్లా మాసాయిపేటలోని కాపలా లేని అన్‌మెన్ లెవెల్ క్రాసింగ్ వద్ద శుక్రవారం రైల్వే అధికారులు హుటాహుటిన రైల్వేగేటు నిర్మాణ పనులు చేపట్టారు.
ఘటన జరిగిన పరిసర ప్రాంతాల జనం ఎప్పటి నుంచో రైల్వే గేటు ఏర్పాటు చేయాలని కోరుతున్నా.. 16మంది చిన్నారుల మరణంతో గానీ రైల్వే అధికారులు తమ నిద్రమత్తు వదల్లేదు. గురువారం లెవెల్ క్రాసింగ్ వద్ద స్కూలు బస్సును ప్యాసింజర్ రైలు ఢీకొన్న దుర్ఘటనలో 16 మంది పిల్లలు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్ మండలంలో జరిగిన సంఘటనపై ఆయన తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. రైల్వే జిఎం శ్రీవాత్సవతో ఫోన్‌లో సంఘటనపై మాట్లాడి తక్షణమే గేటును ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
వెంటనే శ్రీవాత్సవ సికింద్రబాద్‌లోని ఉన్నత అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో వారు శుక్రవారం మాసాయిపేటకు చేరుకొని త్వరితగతిన పనులు చేపట్టారు. గేటు పక్కన గల గార్డు గదిలోని కేబుల్‌ను కనెక్షన్ చేసి గేటుకు చక్రాలు, రాడ్‌తో పాటు మిష్‌నరీని ఏర్పాటు చేశారు. ఇంతకు ముందే ఈ పనిచేసి ఉంటే 16మంది చిన్నారుల ప్రాణాలు నిలిచేవని స్థానికులు వాపోయారు.












Click it and Unblock the Notifications