వైఎస్ జగన్‌ను కలిసిన శ్రీలక్ష్మీ- ఆ హోదా కోసం అప్పటివరకు వెయిటింగ్..!!
అమరావతి: ఏరికోరి ఏపీకి వచ్చిన సీనియర్ ఐఎఎస్ అధికారిణి..వై శ్రీలక్ష్మి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత అదే పనిగా ఆమె ఏపీకి వచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో పని చేయడానికి ఆసక్తిగా ఉండటమే దీనికి కారణం. అదే స్థాయిలో ఆమెను ఆదరిస్తోన్నారు వైఎస్ జగన్. భవిష్యత్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రమోట్ అవుతారనే ప్రచారం ముందు నుంచీ వినిపిస్తూనే ఉంది.

కేసుల కొట్టివేతతో..
ఓబుళాపురం మైనింగ్ వ్యవహారంలో శ్రీలక్ష్మి.. సీబీఐ కేసులను ఎదుర్కొన్నారు. కేసులు నమోదు చేశారే గానీ శ్రీలక్ష్మి అక్రమాలకు పాల్పడినట్లు సాక్ష్యాధారాలను న్యాయస్థానానికి సమర్పించలేకపోయారు. ఆయా కేసులేవీ నిలవలేదు. వాటన్నింటినీ కొట్టి పారేసింది తెలంగాణ హైకోర్టు. ఆమెకు ఊరట కల్పించింది.

స్టేట్ క్యాడర్ మార్పు..
శ్రీలక్ష్మి..1988 బ్యాచ్‌కు చెందిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఎఎస్ అధికారి. అప్పట్లో గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణకు వెళ్లారు. అక్కడ పలు కీలక శాఖల్లో పనిచేశారు. 2019 తరువాత వైఎస్ జగన్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఆమె ఏరికోరి ఏపీకి పోస్టింగ్ వేయించుకున్నారు. తన స్టేట్ క్యాడర్‌ను కూడా మార్చుకున్నారు. ఏపీ క్యాడర్‌కు బదలాయించుకున్నారు.

సముచిత స్థానంలో..
తన ప్రభుత్వంలో వైఎస్ జగన్.. ఆమెకు తగిన ప్రాధాన్యతను ఇస్తూ వస్తోన్నారు. కీలకమైన మున్సిపల్ శాఖ బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం ఈ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తోన్నారామె. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జగనన్న ఇళ్ల కాలనీ పథకం శ్రీలక్ష్మీ బ్రెయిన్ ఛైల్డ్‌గా చెబుతుంటారు. రాష్ట్రంలో పట్టణ పరిపాలనలో విప్లవాత్మక మార్పులకూ శ్రీకారం చుట్టారు.పట్టణాల్లో అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించారు శ్రీలక్ష్మి.

జగన్‌ను కలిసిన శ్రీలక్ష్మి
ఇవ్వాళ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో శ్రీలక్ష్మీ.. వైఎస్ జగన్ ను కలిశారు. కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జగన్ కు పుష్పగుచ్ఛం ఇచ్చి న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ నిర్వహించిన కొత్త సంవత్సరం వేడుకల్లో మంత్రి జోగి రమేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, పోలీస్ డైరెక్టర్ జనరల్ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యతో కలిసి పాల్గొన్నారు శ్రీలక్ష్మి.

2024 జున్ లో
ప్రస్తుత ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి హోదా 2024 జూన్ 30వ తేదీన ముగుస్తుంది. ఆ తరువాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి అపాయింట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారామె. సీనియారిటీ జాబితాలోనూ టాప్ లో ఉన్నారు. దీనితో పాటు వైఎస్ జగన్ కు అత్యంత నమ్మకస్తురాలు కావడం వల్ల సీఎస్ హోదా ఆమెకే లభిస్తుందనే అంచనాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications