అమరావతి ల్యాండ్ పూలింగ్ పై వైసీపీ వైఖరి ఇదే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మచిలీపట్నం- విజయవాడ- గుంటూరు (మావిగన్) అంశం మళ్లీ తెర మీదికి వచ్చింది. వార్తల్లోకి ఎక్కింది. మావిగన్ ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేయాలని గతంలో వైఎస్ జగన్ సూచించినప్పుడు పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చిన ఈ ప్రతిపాదనలను సజీవంగా ఉంచే ప్రయత్నం చేస్తోంది వైఎస్ఆర్సీపీ. జనం నోళ్లల్లో నానేలా చూస్తోంది.
ఈ క్రమంలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి మావిగన్ అంశాన్ని ప్రస్తావించారు. అమరావతి రాజధాని పేరుతో వ్యవస్థీకృత అవినీతి, వివక్ష కొనసాగుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు కలలు కనే అమరావతి ఎప్పటికి పూర్తి అవుతుందో ఎవరికీ అంతుపట్టటం లేదని అన్నారు. అయిదు లక్షల మందిని సర్వనాశనం చేసే బదులు మావిగన్ రాజధానే బెటర్ అని ఆయన అభిప్రాయపడ్డారు.

సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్మాణం పేరుతో సామాన్య రైతులను మోసం చేస్తూ, చంద్రబాబు సన్నిహితులకు మాత్రమే లాభాలు చేకూరుస్తున్నారని విమర్శించారు. దీనికి బదులుగా మావిగన్ రాజధాని కావడం వల్ల ప్రజలకు, రాష్ట్రానికి ఎంతగానో మేలు కలుగుతుందని పేర్కొన్నారు. దీనిపై జగన్ ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా, వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు.
అమరావతిలో అవినీతి మాత్రమే కాకుండా వ్యవస్థీకృత వివక్ష కూడా జరుగుతోందని అన్నారు పేర్ని నాని. సీఆర్‌డీఏ చట్టంలోని నిబంధనలు సామాన్య ప్రజలు, రైతులకు మాత్రమే వర్తిస్తున్నాయని, చంద్రబాబు, ఆయన అనుచరులకు మాత్రం వర్తించడం లేదని ఆరోపించారు. చంద్రబాబు ఈ6 రోడ్డులో అయిదు ఎకరాల్లో భారీ భవనం నిర్మిస్తున్నారని, ఆ స్థలం ఇచ్చిన కంచర్ల కుటుంబానికి అక్కడే ప్లాట్లు కేటాయించడంపై ప్రశ్నలు లేవనెత్తారు.
2024లో ప్లాటు కేటాయించి, 2025లో చంద్రబాబు కొనుగోలు చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు మధ్యలో చంద్రబాబుకు ఎలా స్థలం లభించిందని, సాధారణ రైతులకు అలాంటి ప్రదేశాల్లో ఎందుకు ప్లాట్లు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటి పక్కన ఎవరూ ఉండకూడదన్నట్లు గ్రీన్ బెల్ట్‌గా ప్రకటించారని ఆరోపించారు. మొదటి విడతలో భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ ప్లాట్లు ఇవ్వలేదని తన అనుయాయులకు వాటిని కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు.
చంద్రబాబు అనుచరుల్లోని కొందరికే రాజధానిలో న్యాయం జరుగుతోందని పేర్ని నాని చెప్పారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రైతులను చులకనగా చూస్తోన్నారని, వారిని అవమానపరుస్తున్నారని, ఆయన ఎదుట సెల్‌ఫోన్‌లో మాట్లాడటానికీ వీల్లేని పరిస్థితి నెలకొందని పేర్ని నాని విమర్శించారు. ఈ వ్యవహారాలతో రాజధాని రైతులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారని పేర్కొన్నారు. జూన్‌లో వర్షాలు పడితే అమరావతిలో మళ్లీ నీరు నిలిచి పనులు ఆగిపోతాయని, రైతులకు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రెండో విడతలో భూములు ఇవ్వని రైతుల భూములను నిషేధిత జాబితాలో పెడుతున్నారని పేర్ని నాని ఆరోపించారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఒకవేళ ప్రభుత్వం భూములు తీసుకుంటే భవిష్యత్తులో తమ ప్రభుత్వం వచ్చాక తిరిగి రైతులకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. లక్షన్నర చదరపు అడుగులతో చంద్రబాబు ఇల్లు వేగంగా పూర్తవుతుండగా, అమరావతి నిర్మాణం మాత్రం ఎక్కడిదక్కడే ఉందని అన్నారు. రాజధానిలో నిర్మించే ప్రతి ప్రభుత్వ భవనం సీఆర్‌డీఏకు అద్దె చెల్లించాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications