షాక్.. హత్య కుట్ర తెలిసీ, సలహా: మేయర్ హత్యలో మరో ఇద్దరి అరెస్ట్
చిత్తూరు: మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ హత్య కేసులో పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. హత్య కుట్ర ముందుగానే తెలిసి, సలహాలు ఇచ్చారనే కారణంతో ఒకరిని, హతుడికి ఆశ్రయం కల్పించారని మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు.
హత్య కుట్ర ముందుగా తెలిసి, సలహాలు ఇచ్చినందుకు చిత్తూరు నగరానికి చెందిన లాయర్ యోగానంద్‌ను, నిందితుడికి ఆశ్రయం కల్పించి, సహాయం చేశాడని చెబుతూ శ్రీకాళహస్తికి చెందిన రమేష్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇప్పటి వరకు నిందితుల సంఖ్య 19కి చేరింది. ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే తమ అదుపులో ఉన్న నిందితులను పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. వారి నుంచి మరిన్ని విషయాలు బయటకు వస్తే మరికొంత మంది పాత్ర వెలుగు చూసే అవకాశముందని భావిస్తున్నారు.

కాసరం రమేష్ తెలుగు యువత నేత
అరెస్టైన వారిలో యోగానంద్ లాయర్కాగా, కాసరం రమేష్ తెలుగు యువత నేత. అంతేకాదు శ్రీకాళహస్తీశ్వరాలయ బోర్డు సభ్యుడు. వీరిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. వారికి జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. చింటూతో కాసరం రమేష్‌కు వ్యాపార సంబంధాలు ఉన్నాయని పోలీసులు చెప్పారు.
కాగా, మేయర్ దంపతుల హత్య కేసులో నిందితులకు శిక్ష పడే విషయమై జోరుగా చర్చ సాగుతోంది. కేసును ఛేదించిన పోలీసులు మాత్రం నిందితులు తప్పించుకోకుండా చూసేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.
హత్య చేసిన నిందితులు అదే బిల్డింగులో బాత్రూంకి వెళ్లి చేతులు, ఆయుధాలు శుభ్రం చేసి, వాటిని అక్కడే పడేసి వెళ్లిపోయారు. దీంతో వారి వేలి ముద్రలు దొరకలేదు. ఈ కేసులో నిందితులను పోలీసులు పక్కా సాక్ష్యాలతో అరెస్టు చేయలేదు.
నిందితులే స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోయారు. దీంతో కేసు విచారణ సందర్భంగా ప్లేటు ఫిరాయించే అవకాశం లేకపోలేదంటున్నారు. తమపై అనుమానం వచ్చినందున, తప్పు చేయకపోయినప్పటికీ ఇబ్బందులు లేకుండా లొంగిపోయామని వాదించే అవకాశముందంటున్నారు.
అలాగే పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలాలు కూడా వారు బెదిరించి, హింసించి ఇప్పించినవని కోర్టుకు చెప్పే అవకాశం లేకపోలేదంటున్నారు. అలాగే హత్య జరిగిన రోజు సిసి కెమెరాలు కూడా పని చేయలేదు. నిందితులను చూసిన వారు ఎంతమంది సాక్ష్యం చెబుతారనేది కూడా చూడాలంటున్నారు.












Click it and Unblock the Notifications