బ్రేక్ మాన్‌సూన్ వేళ ఈ ప్రాంతాలకు భారీ వర్షాల హెచ్చరిక..!!
తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈసారి నైరుతి రుతుపవనాల సీజన్ సగం ముగిసినా వర్షాలు ఆశాజనకంగా లేవు. ప్రస్తుతం కొద్దిరోజులుగా రుతుపవన విరామం (బ్రేక్ మాన్‌సూన్) పరిస్థితులు నెలకొనడంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ సమయంలో అమరావతి వాతవరణ శాఖ రానున్న అయిదు రోజులు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇక, రానున్న రెండు నెలలు వర్షాలు కొనసాగుతాయని అంచనా వేసింది.
నైరుతి రుతుపవనాల రెండో సీజన్ (ఆగస్టు-సెప్టెంబరు)లో అధిక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ప్రస్తుతం పసిఫిక్ సముద్రంలో ఎల్‌నినో తటస్థ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పటికే జూన్ 1 నుంచి జులై 31 వరకు దేశంలో 474.3 మి.మీ.ల వర్షం కురిసిందని, ఇది సాధారణ వర్షపాతం (445.8 మి.మీ) కంటే ఆరు శాతం అధికమని గుర్తించారు.

ఏపీలో మాత్రం ఈసారి నైరుతి రుతుపవనాల సీజన్ సగం ముగిసినా వర్షాలు ఆశాజనకంగా లేవు. రాష్ట్ర వ్యాప్తంగా సగటున 25.3 శాతం లోటు వర్షపాతం ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా మినహా మిగిలిన జిల్లాల్లో ఆగస్టు-సెప్టెంబరు మధ్యలో వర్షాలు సాధారణం కంటే ఎక్కువ కురిసే అవకాశముందని ఐఎండీ అంచనాగా వెల్లడించింది.
ప్రస్తుతం కొద్దిరోజులుగా రుతుపవన విరామం (బ్రేక్ మాన్‌సూన్) పరిస్థితులు నెలకొనడంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. వేసవి తరహాలో వేడి, ఉక్కపోత ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆగస్టులో ఉత్తర కోస్తా, రాయలసీమలోని అధిక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని ఐఎండీ తెలిపింది.
వచ్చే 5 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించారు. అలాగే ఆగస్టు రెండో వారంలో వర్షాలు జోరందుకోవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా జూన్-సెప్టెంబర్ రుతుపవన కాలంలో దేశంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతం 87 శాతం-106 శాతం వర్షపాతం నమోదు అవుతుందని ఐఎండీ అంచనా వేసింది.












Click it and Unblock the Notifications