పవన్ కళ్యాణ్: ఏ ముఖంతో.. చిరుకు అభిమాని నిలదీత
విశాఖపట్నం: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర ప్రచార సారథి చిరంజీవికి మెగా అభిమాని ఒకరు షాకిచ్చారు. సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ కాంగ్రెసు పార్టీ బలోపేతం కోసం బస్సుయాత్రను చేపడుతున్న విషయం తెలిసిందే. శనివారం విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో బస్సుయాత్ర కొనసాగింది.
ఈ సందర్భంగా అన్నయ్య యాత్రకు తమ్ముడి ఎఫెక్ట్ పడింది. కాంగ్రెసుకు వ్యతిరేకంగా ప్రజారాజ్యం పార్టీని స్థాపించి... తిరిగి ఆ పార్టీతో ఎలా కలిసి వచ్చారని ఓ మెగా అభిమాని చిరంజీవిని నిలదీశారు. పవన్ కళ్యాణ్, ఆయన స్థాపించిన జనసేన పార్టీకి మద్దతుగా నినాదాలు చేశారు.

పిఠాపురంలోని ఉప్పాడ సెంటర్లో చిరంజీవి మాట్లాడుతుండగా... అనూహ్యంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఓ అభిమాని తన జేబులో నుండి ప్రజారాజ్యం పేరున్న కార్డులను తీసి చించి వేశారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెసు పార్టీకి మద్దతుగా ఏ ముఖం పెట్టుకొని వచ్చారని పలువురు.. కాంగ్రెసు నేతలను ప్రశ్నించారు.
కాగా, యాత్రలో చిరు, ఇతర కాంగ్రెసు నేతలు మాట్లాడుతూ... కాంగ్రెసు పార్టీ పైన సీమాంధ్రలో హత్యాయత్నం జరిగిందని మండిపడ్డారు. సొంత మనుషులే చంపాలని చూశారని, పార్టీని బలహీనపర్చే కుట్ర చేశారని ధ్వజమెత్తారు. తమకు ఇది అగ్ని పరీక్ష అని, కిరణ్‌ది నమ్మక ద్రోహమన్నారు. సోనియా.. కిరణ్, పురంధేశ్వరిలకు ఏం తక్కువ చేశారని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications