సీఎం జగన్ కు మద్దతు ప్రకటించిన 55 లక్షల కుటుంబాలు..!!
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలకు పార్టీని సిద్దం చేస్తున్నారు. ప్రజల్లో తన 46 నెలల పాలకు మద్దతు ఏ స్థాయిలో ఉందో తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ నేతలంతా ప్రతీ ఇంటికి వెళ్తున్నారు. జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని వివరిస్తున్నారు. గత ప్రభుత్వం..జగన్ పాలన పోల్చుతూ అర్దమయ్యేలా వివరిస్తున్నారు. ప్రతీ కుటుంబాన్ని కలిసి మద్దతు కోరుతున్నారు. మొత్తం 1.60 కోట్ల కుటుంబాలలోని ఐదు కోట్ల మందిని కలవటం టార్గెట్గా పెట్టుకున్నారు. మెగా పల్స్ సర్వే నిర్వహిస్తున్నారు. సీఎం జగన్ కు అనూహ్య స్పందన కనిపిస్తోంది.
షెడ్యూల్ పొడిగిస్తూ నిర్ణయం : ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం షెడ్యూల్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రేపటితో పూర్తి కావాల్సి ఉన్న ఈ కార్యక్రమాన్ని 29 వరకు పొడిగిస్తూ నిర్ణయం ప్రకటించారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు పంపిన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం పంపారు. రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న స్పందన, ప్రజలు భాగస్వామ్యం అవుతున్న తీరుతో షెడ్యూల్ ని పెంచిన పార్టీ నాయకత్వం చెబుతోంది. దీంతో, ఈ నెల 29వ వరకు కార్యక్రమం నిర్వహించి వచ్చే నెల 4 లేదా 5 తేదీల్లో సీఎం జగన్ వద్ద సమీక్ష చేసేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు.

55 లక్షల కుటుంబాల నుంచి మద్దతు : ప్రతీ ఇంటికి వెళ్తున్న పార్టీ నేతలు పాలన గురించి వాకబు చేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన విషయాలు..ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమం పైన కరపత్రాలను ప్రతీ ఇంటికి పంపిణీ చేస్తున్నారు. పథకాలు అందుతున్న తీరు పైన ఆరా తీస్తున్నారు. ప్రతీ ఇంటి నుంచి ప్రభుత్వం..పాలనపైన పార్టీ నేతలు మెగా పీపుల్స్ సర్వే నిర్వహిస్తోంది.
జగన్ పాలనకు మద్దతుగా నిలిచే వారి నుంచి మిస్డ్ కాల్ కోరుతున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వానికి మద్దతుగా 55 లక్షలకు పైగా మిస్డ్ కాల్స్ వచ్చాయి. మిస్డ్ కాల్ చేసిన వారికి సీఎం వాయిస్ తో రికార్డు చేసిన మెసేజ్ తిరిగి వెళ్తోంది. ప్రభుత్వానికి మద్దతుగా నిలిచేందుకు ముందుకొచ్చిన కుటుంబాల ఇళ్లకు జగన్ స్టిక్కర్ ను అతికిస్తున్నారు.

పక్కా వ్యూహాత్మకంగా : జగన్ పాలనకు మద్దతిచ్చే వారి సంఖ్య..ఇవ్వని వారి సంఖ్యను బేరీజు వేసుకొని..మిగిలిన వారి మద్దతు కూడా పొందే విధంగా ఎన్నికల్లోనూ కార్యచరణ సిద్దం చేయటానికి వీలుగా ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. దీని ద్వారా క్షేత్ర స్థాయిలో తమకు అందుతున్న మద్దతు గురించి స్పష్టత తీసుకొనేందుకు ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకుంటున్నారు.
అటు సీఎం జగన్ దాదాపుగా తన ఎన్నికల నినాదం స్పష్టం చేసారు. ప్రతీ ఇంటికి మంచి చేసామని..మంచి జరిగిందని నమ్మితే తనకు మద్దతుగా నిలవాలని కోరుతున్నారు. పొత్తులతో ఎంత మంది కలిసినా...తాను సింగిల్ గానే ఫైట్ చేస్తానని స్పష్టం చేసారు. తన బలం..నమ్మకం..ఆత్మ విశ్వాసం తాను నమ్ముకున్న ప్రజలేనని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications