భోళాశంకర్ రివ్యూ: మేకులా దిగబడిన రీమేక్
నటీనటులు: చిరంజీవి, కీర్తి సురేష్, తమన్నా, సుశాంత్, తరుణ్ అరోడా, షాయాజీ షిండే, మురళీశర్మ, వెన్నెల కిషోర్, శ్రీముఖి, రఘుబాబు తదితరులు
నిర్మాతలు: సుంకర రామబ్రహ్మం, కె.ఎస్.రామారావు
రచన: ఆదినారాయణ, శివ
ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మెహర్ రమేష్
ప్రస్తుతం ఫామ్ లో ఉన్న యువ కథానాయకులకు దీటుగా మెగాస్టార్ చిరంజీవి కూడా సినిమాలు చేస్తున్నారు. ఈ సంవత్సరం వాల్తేరు వీరయ్యతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు భోళా శంకర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అజిత్ కథానాయకుడిగా తమిళంలో ఘనవిజయం సాధించి వేదాళం సినిమాకు రీమేక్ ఇది. ఈ రీమేక్ లో ఎటువంటి మార్పులు చేశారు? అభిమానులతోపాటు తెలుగు ప్రేక్షకులందరినీ ఆకట్టుకుందా? అనేది తెలుసుకుందాం.

శంకర్(చిరంజీవి) తన సోదరి మహాలక్ష్మి (కీర్తి సురేష్) తో కలిసి కోల్ కతా వస్తాడు. చెల్లెల్ని కాలేజీలో చేర్పిస్తాడు. తాను టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. మహాలక్ష్మిని చూసిన శ్రీకర్ (సుశాంత్) ప్రేమలో పడతారు. వీరిద్దరికీ వివాహం చేయాలనే ప్రయత్నాల్లో ఉండే శంకర్ ఒకవైపు మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న అలెగ్జాండర్ (తరుణ్ అరోరా) సోదరులను ఒక్కొక్కరినీ చంపుకుంటూ వస్తాడు. ఈ విషయాన్ని శ్రీకర్ సోదరి, క్రిమినల్ లాయర్ లాస్య (తమన్నా)కళ్లారా చూస్తుంది. మానవ అక్రమ రవాణా ముఠాతో శంకర్ కు ఉన్న వైరం ఎలాంటిది? అతని గతమేంటి? శ్రీకర్, మహాలక్ష్మి పెళ్లి జరిగిందా? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాలి.

అందరికీ తెలిసిపోయిన కథకు స్క్రీన్ ప్లేతోపాటు భావోద్వేగాలు (ఎమోషన్స్), హీరోయిజంలో కొత్త దనం లేకుండా, సినిమా మేకింగ్ లో ఎక్కడా చీమ దూరేంత కొత్తదనం లేకుండా సినిమా తీస్తే ఎలా ఉంటుందో అదే భోళాశంకర్. చిరంజీవి-వెన్నెల కిషోర్ మధ్య కామెడీ ట్రాక్ బెడిసికొట్టింది. లాయర్ లాస్య పాత్రలో తమన్నాకు, చిరంజీవి మధ్య వచ్చే సన్నివేశాలు చప్పగా ఉంటాయి. పాటలు, ఫైట్లు ఒకదానివెంట ఒకటి వస్తూనే ఉంటాయి. కానీ వాటి ప్రభావం శూన్యం. సహజంగా ఒక్క సన్నివేశం కూడా లేదు. సినిమా రెండో భాగం ఆరంభమయ్యాక మొదటి భాగంతో పోలిస్తే కాస్తంత ఉపశమనం కలుగుతుంది.

సినిమాలో ఏవైనా సన్నివేశాలు బాగున్నాయా? అంటే ఫ్లాష్ బ్యాక్ లో గ్యాంగ్ స్టర్ బోలాగా చిరంజీవి, తను చేసిన కామెడీ అక్కడక్కడా మెప్పిస్తుంది.పవన్ కల్యాణ్ లా చేయాలనుకున్నదికానీ, శ్రీముఖితో చేసిన ఖుషి నడుము సన్నివేశాలు బెడిసికొట్టాయి. చిరంజీవి ఈ తరహా సన్నివేశాలకు దూరంగా ఉంటేనే బెటరు. కాకపోతే ఆయన ఈ సినిమాలో కాస్తంత స్టైలిష్ గా, హుషారుగా కనిపిస్తారు. మెహర్ రమేష్ నుంచి 10 సంవత్సరాల తర్వాత సినిమా వచ్చింది. కానీ స్టోరీ, స్క్రీన్ ప్లే పరంగా ఏమాత్రం కసరత్తులు చేయలేదని అర్థమవుతోంది.
పాటలు, ఫైట్లతో చిరంజీవి తనవైపు ఏ లోపం లేకుండా చూసుకున్నారు. సినిమా రచనలో చిరంజీవిని ఉపయోగించుకునేంత బలం కనపడలేదు. కీర్తిసురేష్ పాత్ర వల్లే అక్కడక్కడా ఎమోషన్స్ పండాయి. పాటలు మినహా తమన్నాకు ప్రాధాన్యం దక్కలేదు. రఘుబాబు, వెన్నెల కిషోర్ లాంటి నటులున్నా కామెడీ పండలేదు. తరుణ్ అరోరా, షవర్ అలీ ప్రధానమైన విలన్లు. గెటప్ శ్రీను, తాగుబోతు రమేష్, సత్య తదితరులు కనిపించారు.












Click it and Unblock the Notifications