జగన్ భజనపరులకు వైసీపీ సీనియర్ షాక్..! ఆ పనులొద్దని కీలక సలహా..!
ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయాక ఆ పార్టీలో ఏం జరుగుతుందో చాలా మందికి అర్ధం కావడం లేదు. ముఖ్యంగా జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మెప్పుకోసం భజన చేసి ఇతరుల్ని దూరమయ్యేలా చేసిన వారంతా ఇప్పుడు విపక్షంలో ఉన్నా ఆ శైలి వీడటం లేదు. దీంతో గతంలోనే జగన్ కోటరీపై వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు అదే పార్టీలో మరో సీనియర్ నేత, సాయిరెడ్డి సొంత జిల్లాకు చెందిన మరో మాజీ ఎంపీ కూడా గళమెత్తారు.
జగన్ తో పాటు వైఎస్ కుటుంబానికి ఆప్తుడిగా చెప్పుకునే నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇవాళ జగన్ భజనపరులపై మండిపడ్డారు. ఆయన మెప్పు పొందడం కోసం భజనలు చేయొద్దంటూ సుతిమెత్తగా హెచ్చరికలు చేశారు. జగన్ క్షేమం కోరితే ప్రజల క్షేమం కోరినట్లేనని ఆయన చెప్పుకొచ్చారు. అలా ప్రజలు, జగన్ క్షేమం కోరే వారు ఇలా భజనలు చేయాల్సిన అవసరం లేదని మేకపాటి తేల్చేశారు. అప్పుడే ప్రజలు వైసీపీని ఆదరిస్తారన్నారు.

ప్రజలు చదువుకొంటున్నారని, చైతన్యవంతులవుతున్నారని, ఇలాంటి సమయంలో జగన్ కు భజనలు చేసుకుంటూ ఆయన మెప్పు కోసం ప్రయత్నించడం వల్ల ఉపయోగం లేదని మేకపాటి తెలిపారు. పద్దతిగా నడుచుకోవాలని వారికి సూచించారు. ఏ పార్టీకైనా, నాయకుడికైనా అప్పుడే గుర్తింపు వస్తుందని, భవిష్యత్తు కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. అలాగే వైసీపీ నేతల్ని బూతులు మాట్లాడొద్దంటూ మేకపాటి సూచించారు.

అయితే ఇంత హఠాత్తుగా వైసీపీ సీనియర్ నేత అయిన మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇలా గళం విప్పడం మాత్రం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే ఆచితూచి మాట్లాడే నేతగా పేరున్న మేకపాటి.. వివాదాల జోలికి పోరు. అలాగే పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. విధేయత కంటే భజనపరులకే పార్టీలో పెద్దపీట వేస్తున్నారనే ఆగ్రహంతో మేకపాటి ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications