బీ అలర్ట్..మరోసారి వర్షాల హెచ్చరిక..!!
ఒక్క సారిగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో అనూహ్య మార్పులు మొదలయ్యాయి. భారీ ఉష్ణోగ్రతలు..వడగాల్పులతో ఉక్కిరి బిక్కిరి అయిన వేళ అకాల వర్షాలు కురుస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అకాల వర్షాలతో రైతులకు నష్టం తప్పటం లేదు. హైదరాబాద్ భారీ వర్షంతో తడిసి ముద్దయింది. ఏపీలో పలు జిల్లాల్లో ఈ రోజు కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వడగళ్ళతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది.
మరోసారి వర్షాల పైన వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని హెచ్చరించింది. పశ్చిమ విదర్భ నుండి మరాట్వాడా మీదుగా దక్షిణ కర్ణాటక వరకు వ్యాపించిన ఉపరితల ఆవర్తనంతో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో గంటకి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. గత వారం రోజులుగా రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు మండలాల్లో వడగాల్పులు వీచాయి, ఇప్పుడు అకాల వర్షాలు మొదలయ్యాయి.

రాయలసీమలో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు కొనసాగుతున్న ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. దక్షిణ, ఆగ్నేయ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నదిగువ స్థాయిలోని గాలులు ప్రభావంతో రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా చోట్ల వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక, రాగల ఐదు రోజులులకు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40°C (డిగ్రీల సెంటీగ్రేడ్) కన్నా తక్కువగా అనేక చోట్ల నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని చోట్ల 35 డిగ్రీల కన్నా తక్కువగా అక్కడక్కడ నమోదు అయ్యే అవకాశం ఉందని వుల్లడించింది. తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో మెరుపుతు, ఈదురు గాలులకు అవకాశం ఉందని హెచ్చరించింది.












Click it and Unblock the Notifications