ఆపేయాల్సిందే: మెట్రోపై తగ్గని కేసిఆర్, ఎల్ అండ్ టీ నో!
హైదరాబాద్: రాజధాని హైదరాబాదులోని మెట్రో రైలు నిర్మాణ మార్గం మార్చాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెబుతున్నారట. మంగళవారం సచివాలయంలో హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్(హెచ్ఎంఆర్) అధికారులతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అలైన్‌మెంట్ మార్చాలన్న తమ నిర్ణయంలో పునరాలోచన లేదని కేసీఆర్ మరోసారి తేల్చి చెప్పినట్లుగా సమాచారం.
తాము చెప్పిన విధంగా మెట్రో రైలు మార్గాన్ని మార్చుకోవడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు. శాసనసభకు ఎదురుగా ఉన్న గన్‌పార్క్, మొజంజాహీమార్కెట్, సుల్తాన్ బజార్‌లో చారిత్రక కట్టడాలకు ముప్పువాటిల్లకుండా మెట్రో రైలు మార్గాన్ని భూగర్భం నుంచి (అండర్‌గ్రౌండ్) చేపట్టాలని సిఎం పునరుద్ఘాటించినట్టుగా తెలుస్తోంది.

అయితే, దీనిపై ఇప్పటివరకు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, మొదట దశలో ప్రారంభం కానున్న నాగోలు - మెట్టుగూడ మార్గంలో ట్రయల్ రన్ ప్రారంభించడంపై దృష్టి సారించినట్టు ఎల్ అండ్ టి అధికారులు సిఎంకు వివరించారని తెలిసింది.
హైదరాబాద్‌లో చారిత్రక కట్టడాలకు ముప్పువాటిల్లకుండా మెట్రో రైలు మార్గాన్ని కొన్నిచోట్ల మార్చాల్సిందేనన్న తమ అభిప్రాయంపై రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పిన కేసీఆర్... మెట్రో రైలు మార్గాన్ని నిర్ణయించిన గడువులోగా పూర్తి చేయాలని, హైదరాబాద్ నగరంలో జనాభా పెరుగుదల వల్ల ట్రాఫిక్ సమస్య రోజురోజుకు జటిలంగా మారుతుందని, ప్రజా రవాణా వ్యవస్థ మెరుగు పడితే తప్ప సమస్య తీరదని వ్యాఖ్యానించారట.
మెట్రో రైలు మార్గం అలైన్‌మెంట్ మార్చి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని, అప్పటిదాకా ఈ కారిడార్‌లలో పనులు ఆపాలని ఆదేశించారట. అసెంబ్లీ, మొజంజాహి మార్కెట్ ముందు నుంచి, సుల్తాన్ బజార్ మీదుగా మెట్రో రైలును అనుమతించేది లేదని కచ్చితంగా చెప్పారట. వీటిని పరిరక్షించేందుకు భూగర్భ మార్గం సహా అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు.
అయితే, భూగర్భ మార్గం ప్రతిపాదనపై ఎల్అండ్‌టీ నుంచి సానుకూలంగా స్పందన రావడం లేదు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ, సుల్తాన్ బజార్, మొజంజాహి మార్కెట్ల వెనుక నుంచి గానీ, మరోవైపు నుంచి గానీ మెట్రో మార్గం నిర్మించే విషయాన్ని పరిశీలించాలని కేసీఆర్ సూచించారని సమాచారం. దీనిపై క్షేత్రస్థాయిలో సర్వే చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా హెచ్ఎంఆర్‌ను కేసీఆర్ ఆదేశించారు. దీంతో అప్పటి వరకూ ఈ ప్రాంతాల్లో పనులను నిలిపివేయాల్సిందిగా ఎల్అండ్‌టీ మెట్రోకు హెచ్ఎంఆర్ఎల్ సూచించింది.












Click it and Unblock the Notifications