ఆ ఇద్దరూ ఒక్కటిగా వస్తేనే మాకు కలిసొచ్చేది- అంబటి విశ్లేషణ..!!
సీఎం జగన్ కు భయం పరిచయం చేస్తానని చెలరేగిన లోకేశ్ ఈ రోజు ఎలా ఉన్నారని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు సైతం తనను వైఎస్సార్ ఏం చేయలేకపోయారు, జగన్ ఈ నాలుగు న్నారేళ్లల్లో ఏం చేసారంటూ మాట్లాడారని గుర్తు చేసారు. వీరికి భగవంతుడు సరైన రీతిలో సమాధానం చెప్పాడని, పవన్ కు కూడా బుద్ది వచ్చేలా చెబుతాడని అంబటి పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికి రాని వ్యక్తిగా అంబటి విశ్లేషించారు.
చంద్రబాబును జైలుకు వెళ్లి పరామర్శించిన పవన్..నాడు ముద్రగడ ను అరెస్ట్ చేసినా..మ్యాన్ హ్యాండిలింగ్ చేసినా కనీసం ఖండించారా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. మల్టిపుల్ పర్సనాల్టీ డిజాస్టర్ తో బాధ పడుతున్నారని పవన్ ను ఉద్దేశించి అంబటి వ్యాఖ్యానించారు. తాజాగా పవన్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పైన అంబటి ఘాటుగా స్పందించారు. సత్తా లేనప్పుడు ఇలాంటి మాటలే వస్తాయని చెప్పుకొచ్చారు. మనోహర్ ను నమ్ముకొని వెళ్తున్నాడు సముద్రంలోకే వెళ్తారంటూ అంబటి పేర్కొన్నారు. అభిమానులు పవన్ ను సీఎం కావాలని కోరుకుంటుంటే జనసేనాని మంత్రి ఎన్ని సీట్లు ఇస్తారంటూ టీడీపీ కోసం పని చేస్తున్నారని ఎద్దేవా చేసారు.

చంద్రబాబు అరెస్ట్ తో సానుభూతి వచ్చిందనే లెక్కల పైన అంబటి స్పందించారు. చంద్రబాబును అరెస్ట్ చేసి సానుభూతి ఇచ్చే అంత తెలివి తక్కువ వాళ్లమా అని ప్రశ్నించారు. ఎన్నికలు ఉన్నా..లేకున్నా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని..చట్టం తన పని తాను చేసుకుపోతోందని అంబటి స్పష్టం చేసారు. చంద్రబాబు కు సానుభూతి అనేది లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు కొందరు చంద్రబాబును సమర్ధిస్తున్నార ని..వారు కూడా త్వరలోనే అసలు విషయం తెలుసుకుంటారని విశ్లేషించారు. టీడీపీ, జనసేన కలిసి రావాలనే తాము కోరుకున్నామని..కలిసి కట్టుగా వారిని ఎన్నికల్లో ఓడించి పంపిస్తామని అంబటి ధీమా వ్యక్తం చేసారు. పవన్ ప్రజల్ని కాకుండా పార్టీ నాయకుల్ని క్యాడర్ ను మోసం చేశారని అంబటి పేర్కొన్నారు.
చంద్రబాబు, పవన్ కలిసి వస్తేనే తమకు కూడా మంచిదని అంబటి విశ్లేషించారు. కలవాలని ఇప్పుడే నిర్ణయం తీసుకున్నానంటూ పవన్ కేడర్ ను మోసం చేసారని వివరించారు. చంద్రబాబు అరెస్ట్ పైన ఆయన కుటుంబ సభ్యుల కంటే పవన్ ఎక్కువ బాధ పడుతున్నారని పేర్కొన్నారు. పవన్ ను నమ్ముకున్న వాళ్లు ఆలోచన చేయాలని అంబటి సూచించారు. పరామర్శకు వెళ్లి పొత్తు ప్రకటన చేసారని .. రాజకీయాల్లో నైతిక విలువలు లేని వ్యక్తి పవన్ అని విమర్శించారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ సమావేశానికి వెళ్లిన పవన్..టీడీపీతో పొత్తు పెట్టుకునే ముందు ఎన్డీఏను సంప్రదించాల్సిన అవసరం ఉందన్నారు. లేకుంటే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి పొత్తు పెట్టుకోవాల్సిందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications