అప్పుల్లో ప్రతి పైసాకు లెక్కుంది; కరెంట్ ఛార్జీలు పెంచే పేటెంట్ చంద్రబాబుదే: మంత్రి బొత్సా
ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జగనన్న భూ హక్కు - భూ రక్ష పై సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారని పేర్కొన్నారు. భూములపై ఉన్న అన్ని సమస్యలను, వివాదాలను పరిష్కరించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వే చేపడుతున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఏ విధమైన వివాదాలు లేకుండా భూ హక్కు కల్పిస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు బొత్ససత్యనారాయణ పేర్కొన్నారు.

2023 నాటికి భూ సర్వే పూర్తి కావాలని లక్ష్యం
2023 నాటికి భూ సర్వే పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. సొంత భూములే కాకుండా గ్రామ కంఠ భూములను కూడా సర్వే చేస్తున్నామని పేర్కొన్నారు బొత్ససత్యనారాయణ. బ్రిటిష్ కాలం నాటి భూముల సమస్యలు కూడా పరిష్కరిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. భూములపై ఉన్న అన్ని వివాదాలను పరిష్కరిస్తామని, మరో వందేళ్ల వరకు భూములపై ఏవిధమైన సమస్యలు లేకుండా చేస్తున్నామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

కరెంట్ చార్జీల పంపుపై పేటెంట్ రైట్ చంద్రబాబుదే
ఇక రాష్ట్రంలో పెంచిన విద్యుత్ చార్జీలపై తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న విమర్శలపై మండిపడిన బొత్స సత్యనారాయణ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు విద్యుత్ చార్జీలు పెంచారని గుర్తు చేశారు. చంద్రబాబు లాగా తాము ఇష్టారాజ్యంగా విద్యుత్ చార్జీలను పెంచ లేదని పేర్కొన్న బొత్స, ప్రతిపాదనలు పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. కరెంటు చార్జీలు పెంచే పేటెంట్ రైట్ చంద్రబాబుదేనని పేర్కొన్న బొత్స సత్యనారాయణ ఆయన హయాంలో కరెంటు చార్జీలు పెంచలేదా అంటూ ప్రశ్నించారు.

ప్రభుత్వం చేసే అప్పులకు తమ వద్ద లెక్కలు ఉన్నాయి
ప్రభుత్వం చేసే ప్రతి పైసా అప్పుకు తమ వద్ద లెక్కలు ఉన్నాయని పేర్కొన్నారు బొత్ససత్యనారాయణ. లక్షల కోట్ల అప్పులు చేసి తన జేబులలో పెట్టుకుంటున్నామా అని ప్రశ్నించిన ఆయన గత మూడేళ్లలో లక్షా 30 వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ అకౌంట్ల ద్వారా లబ్ధిదారులకు బదిలీ చేశామని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. 45 వేల కోట్లు ఉద్యోగులకు జీతభత్యాలు ఇస్తున్నది వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు బొత్ససత్యనారాయణ.

బషీర్ బాగ్ కాల్పుల ఘటనను గుర్తు చేసిన బొత్సా
ఇక బషీర్ బాగ్ కాల్పుల ఘటనను గుర్తు చేసిన బొత్స సత్యనారాయణ, బషీర్ బాగ్ లో కాల్పులు జరిగి రైతులు చనిపోవటానికి చంద్రబాబు కారణం కాదా అంటూ నిలదీశారు. బషీర్ బాగ్ కాల్పుల ఘటనను చంద్రబాబు మరిచిపోయారా అంటూ ప్రశ్నించిన బొత్స ఇప్పుడు మళ్లీ ఉద్యమాలు చేస్తామంటే జనం నమ్ముతారా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వానికి చంద్రబాబు ఏవైనా మంచి సలహాలు ఇస్తే తీసుకుంటామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తారు
టిడిపి వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని జనాల్లోకి వెళ్తారని ప్రశ్నించిన బొత్స సత్యనారాయణ గ్రామాలకు వెళితే జనాలు టిడిపి వాళ్ల చొక్కాలు పట్టుకుంటారు అంటూ ఎద్దేవా చేశారు. ఇక పిఆర్సి పై ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోందని పేర్కొన్న ఆయన త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. గతంలో ఏం జరిగిందో ప్రస్తుతం ఏం జరుగుతుందో ప్రజలే చూస్తున్నారని, ఎవరి పాలన బాగుంది ప్రజలే నిర్ణయిస్తారని బొత్స సత్యనారాయణ వెల్లడించారు.












Click it and Unblock the Notifications