ఏపీ రాజధాని ఒక్కటే - మంత్రి బుగ్గన సంచలనం..!!
మంత్రి బుగ్గన కీలక వ్యాఖ్యలు చేసారు. మూడు రాజధానులు అనేదే తప్పుగా వెళ్లిన సందేశంగా పేర్కొన్నారు.
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం పై ఆర్దిక మంత్రి బుగ్గన కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికే విశాఖ నుంచి పాలన ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. న్యాయ పరమైన సమస్యలను పరిష్కరించుకొని ముందుకు వెళ్లాలని భావిస్తోంది. ఈ నెల 23న మూడు రాజధానుల కేసు సుప్రీంలో విచారణకు రానుంది. సుప్రీంలో తీర్పు అనుకూలంగా వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఆలస్యం జరిగితే విశాఖ కేంద్రంగా సీఎం క్యాంపు కార్యాలయం ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇదే సమయంలో మూడు రాజధానుల వ్యవహారం పై మంత్రి బుగ్గన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బెంగుళూరు కేంద్రంగా మంత్రి బుగ్గన విశాఖ ప్రాధాన్యత గురించి వివరించారు. మూడు రాజధానులు అనేదే తప్పుగా వెళ్లిన సందేశంగా పేర్కొన్నారు.

ఏపీకి విశాఖ రాజధానిగా ఉంటుంది
ఏపీ రాజధానులకు సంబంధించి ఆర్దిక మంత్రి బుగ్గన చేసిన వ్యాఖ్యలు చర్చకు కారణమయ్యాయి. విశాఖలో మార్చి 3,4 తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ కు బెంగళూరులో నిర్వహించిన రోడ్ షో ల బుగ్గన రాజధానుల అంశం ప్రస్తావించారు. విశాఖ రాజధానిగా చేయబోతున్నామని బుగ్గన స్పష్టం చేసారు. కర్ణాటకలో తరహాలోనే ఒక సెషన్ అసెంబ్లీ సమావేశాలను గుంటూరులో నిర్వహిస్తామని చెప్పారు. ఏపీ తదుపరి రాజకధానిగా విశాఖను తమ ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. రాష్ట్ర పాలన అంతా విశాఖ నుంచే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. విభజన తరువాత పాలనా రాజధాని గా విశాఖను ఎంచుకోవటానికి అక్కడ ఉన్న మౌళిక సదుపాయాలే కారణంగా వివరించారు. ఏపీకి మూడు రాజధానులు అన్నది అవాస్తమంటూ బుగ్గన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

కర్నూలులో హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ మాత్రమే
కర్నూలు గురించి బుగ్గన వివరించారు. కర్ణాటకలోని ధార్వాడ్ లో ఒక హైకోర్టు బెంచి, గుల్బర్గాలో మరో బెంచి ఉన్నాయని గుర్తు చేసారు. అదే విధంగా కర్నూలులో హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ ఉంటుందని వెల్లడించారు. 1937 నాటి శ్రీభాగ్ ఒప్పందం మేరకు పాలనా రాజధాని ఒక చోట..కోర్టు మరోచోట ఉండాలని నిర్ణయించిన విషయాన్ని ప్రస్తావించారు. అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యం ఉండేలా చూడాలని అప్పట్లో ఈ నిర్ణయం జరిగిందని మంత్రి వివరించారు.ఆ ప్రకారమే కర్నూలులో ప్రిన్సిపల్ బెంచ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని మంత్రి చెప్పుకొచ్చారు. భవిష్యత్ లో విశాఖ మరింతగా పురోగతి సాధించే అవకాశం ఉందన్నారు. అందుకే ఐటీ ఆధారిగా పెట్టుబడులను విశాఖకు ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు. ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు విశాఖలో అనుకూల వాతావరణం ఉందని మంత్రి చెప్పారు.

మంత్రి వ్యూహాత్మక ప్రకటన చేసారా..
కర్నూలు లో హైకోర్టు బెంచ్.. గుంటూరులో ఒక విడత అసెంబ్లీ సమావేశాలు అని చెప్పటం ద్వారా ఇప్పుడు కొత్త చర్చ తెర మీదకు వచ్చింది. మంత్రి బుగ్గన విశాఖ ఏపీకి రాజధానిగా కొనసాగుతుందని స్పష్టం చేసారు. అయితే.. ప్రభుత్వం ఇప్పటి వరకు మూడు రాజధానులుగా చెబుతూ వచ్చింది. హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తామని చెప్పింది. అమరావతిలోనే శాసనసభ కొనసాగుతుందని వెల్లడించింది. కానీ, ఇప్పుడు ఆర్దిక మంత్రి బుగ్గన చేసిన వ్యాఖ్యల వెనుక కొత్తగా మూడు రాజధానుల బిల్లు పెట్టకుండా... రాజధాని మార్పుగా కాకుండా... కార్యాలయ తరలింపు అంటూ ఆఫీసులను విశాఖకు తరలించే అవకాశముందనే కొత్త చర్చ మొదలైంది. తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి కొలువైన ప్రాంతం ఏపీకే పరిమితం కాదని, మొత్తం ప్రపంచానికే ఆధ్మాత్మిక రాజధానిగా మంత్రి బుగ్గన పేర్కొన్నారు. అయితే.. ఇప్పుుడు బుగ్గన తన వ్యాఖ్యల పైన ఏ విధంగా స్పందిస్తారు.. ప్రభుత్వం నుంచి స్పష్టత వస్తుందా అనేది చూడాలి.












Click it and Unblock the Notifications