శ్రేయోభిలాషిగా చెబుతున్నా..: జంగా కృష్ణమూర్తికి మంత్రి సూచనలు
Minister Chelluboina Venu Gopal Krishna: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనమండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలపై సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ స్పందించారు. ఈ విమర్శలను తిప్పి కొట్టారు. ఆయన చేసిన వ్యాఖ్యలు బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ట్రాప్‌లో జంగా కృష్ణమూర్తి పడ్డారని వేణుగోపాల కృష్ణ అన్నారు. బీసీల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎంత పాటు పడుతోందనేది అందరికీ తెలుసునని గుర్తు చేశారు. వైఎస్ జగన్‌ను బీసీల ఆత్మగౌరవ రక్షకుడిగా అభివర్ణించారు.

కేబినెట్‌లో 11 మంది బీసీ మంత్రులు ఉన్నారని, కీలక శాఖలన్నీ వారి వద్దే ఉన్నాయని మంత్రి వేణుగోపాల్ పేర్కొన్నారు. బీసీల అవసరాలు తీర్చడానికి అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రులు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వగలరని ఆలోచించే జగన్ ఆ నిర్ణయం తీసుకున్నారని వివరించారు.
జగన్ పాలనలో బీసీలు ఆత్మగౌరవంతో తలెత్తుకు తిరగగలుగుతున్నారని చెల్లుబోయిన అన్నారు. గతంలో బీసీలను చంద్రబాబు ఏ విధంగా అణచి వేశాడో అందరికీ తెలుసునని అన్నారు. తమ ప్రభుత్వ పాలనలో నలుగురు బీసీలు రాజ్యసభకు వెళ్లారని, మరో ఎస్సీ నాయకుడు రాజ్యసభకు నామినేట్ అయ్యారని చెప్పారు.
ఇంతమంది బీసీలకు జగన్ రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఇచ్చినప్పుడు కూడా నేతి బీరకాయలోని నెయ్యిలా వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. పార్టీ నుంచి వెళ్తూ వెళ్తూ నింద వేయడం జంగా కృష్ణమూర్తి వంటి నాయకుడి స్థాయికి తగదని మంత్రి వేణుగోపాల్ చెప్పారు. జంగా కృష్ణమూర్తి ఎలాంటి ప్రతిపాదన చేసినా జగన్ దాన్ని అమలులో పెట్టారని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం బీసీలకు ఒక ఇస్త్రీ పెట్టె ఇచ్చి చేతులు దులుపుకుంటే జగన్ ప్రభుత్వం బీసీలకు ఎంత ఇచ్చిందో జంగా కృష్ణమూర్తికి తెలియదా? అంటూ ప్రశ్నించారు. టంకుటమార విద్యలు నేర్చిన చంద్రబాబు ట్రాప్‌లో జంగా పడ్డారని, అందులో పడి ఇలాంటి మాటలు మాట్లాడటం సమంజసం కాదని మంత్రి చెల్లుబోయిన పేర్కొన్నారు.
కులగణనతో బీసీల ఆత్మగౌరవం తీరుస్తోన్న జగన్‌పై నిందలు వేయడానికి జంగా కృష్ణమూర్తికి మనసు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఆయన సీటు ఆశించి ఉండొచ్చని, అది దక్కకపోవడం ఉండొచ్చని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 2.55 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లోకి వెళ్తే దాంట్లో 1.80 లక్షల కోట్లు బీసీల ఖాతాల్లోకి వెళ్లిందని అన్నారు.
రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే అందులో అత్యధిక శాతం బీసీలకే లభించాయని చెల్లుబోయిన అన్నారు. టీడీపీ ప్రలోభంతో నాయకుడిపై నింద వేస్తే బీసీలు నమ్ముతారని చంద్రబాబు అనుకుంటాడని, అది భ్రమేనని అన్నారు. బీసీలకు రాజ్యాధికారం జగన్‌కే సాధ్యం అని, దానికి తామిద్దరమే సాక్ష్యమని వ్యాఖ్యానించారు.

పక్కవాడు ఇచ్చిన స్క్రిప్ట్‌ను పలకడం బీసీల నమ్మకంపై దెబ్బకొట్టడమేనని, అందుకే ఆయన శ్రేయోభిలాషిగా తాను జంగా కృష్ణమూర్తికి ఒకటే కోరుతున్నానని, ఈ ఆరోపణలను ఉపసంహరించుకుంటే బాగుంటుందని సూచించారు. చంద్రబాబు ప్రలోభాలకు జంగా కృష్ణమూర్తి లొంగకూడదని బీసీల తరఫున సూచన చేస్తున్నానని చెప్పారు. ఒక ఆశయం కోసం పనిచేస్తోన్న జగన్‌కు వెన్నంటి ఉండాలని చెప్పారు.












Click it and Unblock the Notifications