తొడగొట్టి- మీసం మెలేసిన మంత్రి ధర్మాన..!!
ఏపీ సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు తొడగొట్టారు. మీసం మెలేశారు. చంద్రబాబుకు సవాల్ చేసారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు లో వైసీపీ కార్యకర్త ఒక్కరైనా లంచం తీసుకున్నారని చంద్రబాబు చెప్పగలరా అంటూ ఛాలెంజ్ విసిరారు. ఒక్క నయా పైసా కూడా తీసుకోలేదని తాము తొడగొట్టి చెబుతున్నామన్నారు. ఈ వ్యాఖ్యల సమయంలో మంత్రి ధర్మాన తొడగొట్టి, మీసం మెలేసారు. పేదల బతుకులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మంత్రి వివరించారు.
మంత్రి ధర్మాన ప్రసాద రావు కొద్ది రోజులుగా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో రాజధాని కోసం కొద్ది నెలల క్రితం మంత్రి ధర్మాన రాజీనామాకు సిద్దపడ్డారు. సీఎం జగన్ వారించటంతో వెనక్కు తగ్గారు. వైసీపీకి ఓట్లు వేయకపోతే పథకాలు నిలిచిపోతాయని చెప్పుకొచ్చారు. వైఎస్సార్ ఆసరా పంపిణీ సభల్లో మంత్రి ధర్మాన పథకాల పంపిణీ..లబ్దిదారులకు అందుతున్న ప్రయోజనాల గురించి వివరించారు. ఇదే సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు పైన ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు గార మండలం కళింగపట్నంలో జరిగిన సభలో మంత్రి ధర్మాన మీసం మెలేసి తొడ గొట్టటం సంచలనంగా మారింది. ఇంత చేస్తున్నా పరిపాలన బాగోలేదంటే ఇక మేమేం చేయగలమని ధర్మాన వ్యాఖ్యానించారు.

మళ్లీ అధికారంలోకి వచ్చి దోచుకుందామనే టీడీపీ నేతలు ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజలు దీన్ని గమనించాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్ కు మద్దతు గా నిలవాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న పథకాలు 2024 మే తరువాత కూడా అమలు కావాలంటే మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కావాలని..లేకుంటే పథకాలు ఆగిపోతాయని ధర్మాన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నారని..అన్ని వర్గాలకు మేలు చేస్తున్న ప్రభుత్వమని ధర్మాన వివరించారు. పేదల జీవితాలను మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో అధిక శాతం మహిళలకే అందచేస్తున్నామన్న ధర్మాన..ముఖ్యమంత్రి జగన్ కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications