విశాఖ కేంద్రంగా ఏపీ ముఖచిత్రం మారబోతుంది - మంత్రి అమర్‌నాథ్ ..!!
విశాఖ కేంద్రంగా తీసుకొనే నిర్ణయాలు రాష్ట్రం ముఖచిత్రం మారుస్తాయని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు.
రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేసారు. మార్చి 3, 4 తేదీల్లో జరగబోయే పారిశ్రామిక సదస్సు ద్వారా కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలోని యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయని చెప్పారు. అన్ని రంగాల్లో పెట్టుబడులు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. మార్చి 3, 4 తేదీల్లో విశాఖ వేదికగా జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా పారిశ్రామికంగా రాష్ట్రం ముఖచిత్రం మారబోతుందని... రాష్ట్రానికి మంచి జరుగుతుందని మంత్రి అమర్నాధ్ పేర్కొన్నారు.
పారిశ్రామిక సదస్సు విజయవంతం కాకూడదని, రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు అనే కుట్రతో టీడీపీ మద్దతు మీడియా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తమ రాతలతో ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. మీడియా సమావేశంలో అసత్యాలు ప్రచురిస్తున్నారంటూ ఒక ప్రధాన పత్రిక ప్రతులను చించివేశారు. ప్రభుత్వానికి, సీఎం వైయస్ జగన్‌కు పేరు రాకూడదనే ఉద్దేశంతో ఇలాంటి అసత్య కథనాలను రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

సీఎం జగన్ పరిపాలనలో ఏ మంచి జరిగినా చెడుగానే చూపిస్తామన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. గన్నవరం ఘటనలో పాత ఫొటోలు ప్రచురించి గందరగోళం సృష్టించారని మంత్రి మండిపడ్డారు. తప్పుడు రాతలు, సమాజానికి, రాష్ట్రానికి ఇబ్బంది కలిగించే అబద్ధాలు ఇప్పటికైనా మానుకోవాలని సూచించారు.
విశాఖలో జరిగే పారిశ్రామిక సదస్సు ద్వారా కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని ధీమా వ్యక్తం చేసారు. ఏపీకి సహజ సిద్దగా ఉన్న వనరులు..సముద్రతీరం కలిసి వస్తుందని చెప్పారు. ప్రభుత్వం రూ.15 వేల కోట్లు ఖర్చు చేసి 3 పోర్టులు నిర్మిస్తోందని వివరించారు. పీపీపీ కింద మరో పోర్టు నిర్మాణం జరుగుతుందన్నారు. ఇప్పటికే 6 ఆపరేషన్ పోర్టులు ఉన్నాయని... 9 ఫిషింగ్ హార్బర్లు నిర్మించబోతున్నట్లు వెల్లడించారు.

పోర్టు ఆధారిత ఇండస్ట్రీయల్ డెవలప్‌మెంట్ సీఎం జగన్ ఆలోచన చేస్తున్నారన్నారు. పోర్టులకు ఆనుకొని విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లో దాదాపు 26 వేల నుంచి 30 వేల ఎకరాలు పారిశ్రామిక భూములు ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నాయని చెప్పారు. దేశంలో, ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన నగరాలన్నీ పోర్టు కలిగి ఉన్న నగరాలేనని వివరించారు. రాష్ట్రంలోని వనరులను గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో ప్రదర్శించబోతున్నట్లు మంత్రి గుడివాడ అమర్ తెలిపారు.












Click it and Unblock the Notifications