పవన్ కళ్యాణ్ పై వాలంటీర్ ని నిలబెట్టి గెలుస్తాం: మంత్రి జోగి రమేష్ సవాల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. తాజాగా ఏపీలో చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ లు ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, వైసిపి పాలనను టార్గెట్ చేస్తున్నారు. దీంతో మంత్రి జోగి రమేష్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ల తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేడు తాడేపల్లిలో ప్రెస్ మీట్ నిర్వహించిన మంత్రి జోగి రమేష్ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వృద్ధ సైకో, పిల్ల సైకో, ఇంకో సైకో గంజాయి తాగి రోడ్డున పడ్డారని మంత్రి జోగి రమేష్ విరుచుకుపడ్డారు. భూతాలు, పిశాచాలు, సైతాన్ ల గురించి పురాణాల్లో గ్రంథాల్లో చెప్పేవారని కానీ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లే, భూతాలు, పిశాచాలు, సైతాన్ లంటూ వ్యాఖ్యానించారు.

వీరు ముగ్గురు రాష్ట్రంలో ప్రజలందరికి సంక్షేమం అందుతుంటే తట్టుకోలేక శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. లోకేష్ ఒక అప్పడం గాడన్నారు. వార్డు మెంబర్ గా కూడా గెలవని లోకేష్ గవర్నర్ ను ఏ అర్హతతో కలిశారన్నారు. పవన్ కళ్యాణ్ కు జగన్ గురించి మాట్లాడే అర్హత లేదని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. చంద్రబాబు ఇచ్చిన కాగితాలు చూసి పవన్ కళ్యాణ్ చదువుతున్నారని జోగి రమేష్ పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ కు ఏపీకి సంబంధమే లేదని ఇక నుంచి పవన్ ఎక్కడ పోటీ చేసినా వాలంటీర్ ని నిలబెట్టి ఓడిస్తామని సవాల్ విసిరారు. పవన్ ని ఓడించడానికి వైసిపి నాయకులు ఎవరు అవసరం లేదని, కేవలం ఒక వాలంటీర్ చాలన్నారు. ప్రజలపై పవన్ కళ్యాణ్ కి ప్రేమాభిమానాలకు ఉంటే పొత్తులకు వెళ్లకుండా ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగాలని సవాల్ విసిరారు.
అంతకు ముందు చంద్రబాబు పైన విరుచుకుపడిన జోగి రమేష్ వైసిపి ఇస్తున్న నవరత్నాలు, జగన్ చేస్తున్న సంక్షేమం గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటుంది అని పేర్కొన్నారు. గడపగడపకు వెళ్లి పథకాల గురించి మాట్లాడుతున్న ప్రభుత్వాన్ని ఎక్కడైనా చూశారా అంటూ ప్రశ్నించిన ఆయన, చంద్రబాబుకు చీము, నెత్తురు, దమ్ము ధైర్యం ఉంటే తాము ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications