ఆ దూకుడుగాళ్ళ వల్లే ఇదంతా, పవన్ వారాహి యాత్రపైనా వైసీపీ మంత్రి హాట్ కామెంట్స్!!
బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలు వైసీపీ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో వైసీపీ మంత్రులు తీవ్ర స్థాయిలో బీజేపీపై విరుచుకుపడుతున్నారు. ఏ సమయంలో ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేనను సైతం టార్గెట్ చేస్తున్నారు. టీడీపీ చెప్పింది వారు మాట్లాడారని మండిపడుతున్నారు.
తాజాగా మంత్రి మేరుగు నాగార్జున తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన దూకుడుగాళ్ళు సీఎం రమేష్, సుజనా చౌదరి ఇచ్చిన స్క్రిప్టుని బిజెపి నేతలు చదువుతున్నారని, కావాలని వైసిపి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని విమర్శించారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి ఇవ్వవలసిన విభజన హామీల చట్టం గురించి మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొదటినుంచి కొట్లాడుతున్న ప్రత్యేకహోదా గురించి కూడా మాట్లాడలేదని అసహనం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు లేకపోయినా, బిజెపి వారితో కలిసినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోమారు అధికారంలోకి వస్తుందని మంత్రి మేరుగు నాగార్జున ధీమా వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకుని, ఇప్పుడు ఏపీకి ఏదో మంచి చేస్తున్నట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఏపీలో ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ అధికారంలోకి వచ్చేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీనే అని, మరోసారి సీఎం జగన్ ముఖ్యమంత్రి అవుతారని మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను ఉద్దేశించి సెటైర్లు వేసిన ఆయన పవన్ కళ్యాణ్ యాత్రను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు.
అది వారాహి యాత్ర కాదు నారాహి యాత్ర అంటూ ఎద్దేవా చేశారు. అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందిస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటూ కితాబిచ్చారు. విద్యా వ్యవస్థ లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని, పిల్లల బంగారు భవిష్యత్తుకు ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి బాటలు వేస్తున్నారని ఆయన కొనియాడారు.












Click it and Unblock the Notifications