వకీల్ సాబ్ బెనిఫిట్ షో ఇష్యూపై మంత్రి పేర్ని నాని రియాక్షన్... అసలు దరఖాస్తే చేసుకోలేదని కామెంట్...
జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమా ఏపీలో రాజకీయ చిచ్చు రేపింది. సినిమా బెనిఫిట్ షోలకు అనుమతినివ్వకపోవడంతో బీజేపీ,జనసేన నేతలు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్ కల్యాణ్‌కు భయపడే బెనిఫిట్ షోలకు అనుమతినివ్వలేదని విమర్శిస్తున్నారు.
ఇదే అంశంపై తాజాగా ఓ టీవీ చర్చా కార్యక్రమంలో మంత్రి పేర్ని మాట్లాడారు. 'తమిళనాడులో డీఎంకె నేతల ఇళ్లపై ఎన్నికల సమయంలో ఐటీ దాడులు జరిగితే... వ్యవస్థ తన పని తాను చేసుకుపోయిందనుకున్నాం... ఇక్కడ కూడా అంతే... బెనిఫిట్ షోలపై సంబంధిత అధికారులు నిర్ణయం తీసుకున్నారు... అంతే తప్ప దానికీ,సీఎం జగన్‌కు సంబంధం లేదు..' అని స్పష్టం చేశారు.

బెనిఫిట్ షోల పేరుతో రూ.1000 చొప్పున టికెట్ రేట్లు వసూలు చేయడమేంటని పేర్ని నాని ప్రశ్నించారు. అసలు బెనిఫిట్ షోలకు వకీల్ సాబ్ సినీ నిర్మాత,డిస్ట్రిబ్యూటర్లు దరఖాస్తు చేసుకోలేదన్నారు. మల్టీప్లెక్సుల్లో ఐదు నుంచి ఆరు షోలకు అనుమతించామని చెప్పారు. వకీల్ సాబ్ నిర్మాత,డిస్ట్రిబ్యూటర్లతో తమకేమీ తగాదాలు లేవన్నారు.బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ దేవధర్ తిరుపతిలో ఓట్లు అడిగేందుకు వచ్చారా.. లేక సినిమా టికెట్లు కొనమని చెప్పడానికి వచ్చారా... అని ప్రశ్నించారు.
వకీల్ సాబ్‌కు,బీజేపీకి భయపడే తిరుపతి ఉపఎన్నికలో జగన్ ప్రచారానికి వస్తున్నారని చేస్తున్న విమర్శలను మంత్రి పేర్ని నాని కొట్టిపారేశారు. హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ గల్లీ ఎన్నికల కోసం కేంద్రమంత్రి అమిత్ షా,పలువురు బీజేపీ ముఖ్యమంత్రులు సైతం వచ్చి ప్రచారం చేశారని గుర్తుచేశారు. అలాంటిది ఒక ఉపఎన్నిక కోసం సీఎం జగన్ వెళ్లి ప్రచారం చేయడంలో తప్పేముందన్నారు. అంతకుముందు,ఇదే అంశంపై వైసీపీ నందిగం సురేశ్ మాట్లాడుతూ... వకీల్ సాబ్‌లో పెద్దగా విషయంలో లేదని... టికెట్లు కొనేవాళ్లు లేక ఇలా గొడవలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ... కోటు వేసుకున్న ప్రతీవారు వకీలు అవుతారా... గడ్డం పెంచిన ప్రతీ ఒక్కరూ సాధువు అవుతారా అని ప్రశ్నించారు. వకీల్ సాబ్‌ను చూసి వైసీపీ భయపడుతుందనడం అర్థం లేని విమర్శలు అని కొట్టిపారేశారు.
తిరుపతి ఉపఎన్నికకు వారం రోజుల ముందు వకీల్ సాబ్ సినిమా విడుదలవడంతో... ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. పవన్‌కు భయపడే బెనిఫిట్ షోలకు అనుమతినివ్వలేదని బీజేపీ,జనసేన నేతలు ఆరోపిస్తుంటే... సినిమా హిట్టయినంత మాత్రానా రాజకీయాల్లో దాని ప్రభావం ఉండదని వైసీపీ నేతలు అంటున్నారు.












Click it and Unblock the Notifications