గుండెపోటు వచ్చి తారకరత్న పడిపోతే..- కీలక వ్యాఖ్యలు చేసిన రోజా..!!
నారా లోకేష్ పై మంత్రి ఆర్ కే రోజా మరోసారి విమర్శలు గుప్పించారు. నారా లోకేష్ ను అంకుల్‌గా సంబోధించారు. ఆయనది ఓ ఐరెన్ లెగ్ అని ఎద్దేవా చేశారు. నారా లోకేష్ చేపట్టింది పాదయాత్ర కాదని జోకేశ్ యాత్రగా చురకలు అంటించారు.
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పై పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా మరోసారి విమర్శలు గుప్పించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఆమె తిప్పి కొట్టారు. నారా లోకేష్ ను అంకుల్‌గా సంబోధించారు. ఆయనది ఓ ఐరెన్ లెగ్ అని ఎద్దేవా చేశారు. నారా లోకేష్ చేపట్టింది పాదయాత్ర కాదని జోకేశ్ యాత్రగా చురకలు అంటించారు. లోకేష్ రాజకీయ అరంగేట్రంతో చంద్రబాబు పతనం మొదలైందని రోజా విమర్శించారు.

కుటుంబ సభ్యులపై..
నారా లోకేష్ తన కుటుంబ సభ్యులపై విమర్శలు చేయడాన్ని రోజా తప్పుపట్టారు. లోకేష్ ఏక్ నిరంజన్ లాంటోడని, ఆయనకు తోబుట్టువులెవరూ లేరని, అందుకే వారి విలువ తెలియట్లేదని అన్నారు. తోబుట్టువుల ఉంటే వారి విలువ ఏమిటో తెలిసేదని గుర్తు చేశారు. తాను సినీరంగంలో ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు తన తోడబుట్టినవారు, భర్త అండగా ఉన్నారని, అందులో తప్పేముందని రోజా ప్రశ్నించారు.

గుండెపోటుతో
తన కోసం, తనతో కలిసి నడవటానికి కుప్పానికి వచ్చిన నందమూరి తారకరత్న గుండెపోటుతో కుప్పకూలిపోతే- నారా లోకేష్ ఆయనను కనీసం పట్టించుకోలేదని రోజా విమర్శించారు. పార్టీ కార్యకర్తలతో దండలు వేయించుకుంటూ, శాలువా కప్పుకొంటూ పాదయాత్ర మొదలెట్టాడని మండిపడ్డారు. అలాంటి లోకేష్ కు కుటుంబ సభ్యులు, తోబుట్టువుల విలువ ఏం తెలుసుని రోజా ఎదురుదాడికి దిగారు.

అవినీతికి కేరాఫ్
అవినీతికి కేరాఫ్ అడ్రస్ ఏదైనా ఉందంటే- అది నారా కుటుంబమేనని రోజా ఆరోపించారు. చంద్రబాబు, భువనేశ్వరి, బ్రాహ్మిణి, లోకేష్ అవినీతి చక్రవర్తులుగా గుర్తింపు పొందారని విమర్శించారు. రెండెకరాల రైతు చంద్రబాబు, ఏ విధంగా వేల కోట్ల రూపాయలకు పడగలెత్తాడో చిత్తూరు ప్రజలకు తెలుసని అన్నారు. అందుకే ఎన్నికలొచ్చిన ప్రతీసారి చంద్రబాబు చావుతప్పి కన్ను లొట్ట పడ్డట్టుగా గెలవడానికి నానా తిప్పలు పడుతుంటారని చెప్పారు.

సీబీఐ విచారణకు సిద్ధమా..?
ఏ కేసు పెట్టినా స్టేలు తెచ్చుకుని తప్పించుకుని తిరిగే అలవాటున్న చంద్రబాబు, నారా లోకేష్ కు తాను ఒకటే సవాల్ విసురుతున్నానని రోజా అన్నారు. తనతో పాటు చంద్రబాబు ఆస్తుల మీద సీబీఐతో విచారణ జరిపించడానికి సిద్ధమేనా? అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు ఇంటికి డబ్బు సంచులు ఏ విధంగా వచ్చాయో బయటకొస్తే- వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పరిస్థితి జీరోకి దిగజారుతుందని ధ్వజమెత్తారు. 23 సీట్లు కూడా గల్లంతవుతాయని చెప్పారు.

లోకేశ్ యాత్రలో జై జగన్ నినాదాలు
నారా లోకేష్ చేస్తోన్న పాదయాత్రలో రోడ్ల పక్కన నిల్చొన్న ప్రజలు జై జగనన్ అంటూ నినాదాలు చేస్తోన్నారని, అవి అతనికి వినిపించట్లేదా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ మౌనంగా ఉంటోండటం వల్లే నారా లోకేష్ ఆటలు సాగుతున్నాయని, ఆయన ఒక్కసారి కన్నెర్ర చేస్తే అతను మాడిమసైపోతాడని రోజా హెచ్చరించారు. లోకేష్ తన పర్యటనలో ఎర్ర చందనం దొంగలను వెంటబెట్టుకుని తిరుగుతున్నాడని ఆరోపించారు.












Click it and Unblock the Notifications