చంద్రబాబు చేసిన అవమానాలను మోదీ ఎలా మర్చిపోగలరు
Chandrababu Naidu: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ సాయంత్రం ఆయన ఢిల్లీకి చేరుకోనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమౌతారు.
బీజేపీతో పొత్తు కోసం తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు సాగిస్తోన్న విషయం తెలిసిందే. దీనికోసం చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు. జనసేన సైతం ఇదే కోరుకుంటోంది. అన్ని పార్టీలతో కలిసి ఉమ్మడిగా వైఎస్ఆర్సీపీని ఎదుర్కొనాలని భావిస్తోంది. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా టీడీపీ-జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్లడానికి సంసిద్ధంగా ఉన్నారు.

ఈ పరిణామాల మధ్య చంద్రబాబు బుధవారం ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. గురువారం ఉదయం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో వేర్వేరుగా సమావేశమౌతారు. పొత్తు అంశాలపై చర్చిస్తారు. సీట్ల పంపకాల గురించీ మాట్లాడతారు.
చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై తాజాగా మంత్రి రోజా స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఇదే చంద్రబాబు గతంలో అనరాని మాటలు అన్నాడని గుర్తు చేశారు. ప్రధాని హోదాలో మోదీ ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు నల్లజెండాలను ఎగురవేశారని, గో బ్యాక్ మోదీ అనే హోర్డింగులను పెట్టారని అన్నారు. ఈ అవమానాలను మోదీ మర్చిపోయి ఉండరని అన్నారు.
అమిత్ షా తిరుపతి పర్యటనకు వచ్చినప్పుడు ఆయన కారు మీద రాళ్లను వేయించిన చరిత్ర చంద్రబాబుకు ఉందని పేర్కొన్నారు. బీజేపీతో జట్టుకట్టి దాన్ని తెగదెంపులు చేసుకుని, కాంగ్రెస్ పంచన చేరి.. ఇప్పుడు మళ్లీ బీజేపీతో చేతులు కలపడానికి చంద్రబాబు ప్రయత్నిస్తోన్నారని, ఇంతకంటే దిగజారుడు రాజకీయాలు ఉండవని రోజా విమర్శించారు.

ఇప్పుడు మళ్లీ బీజేపీతో పొత్తుల కోసం ఢిల్లీకి పరుగెడుతున్నాడని, ఏ ఎండకు ఆ గొడుగు పట్టేరకం చంద్రబాబు అని వ్యాఖ్యానించారామె. ముఖ్యమంత్రి పదవి కోసం చంద్రబాబు ఎంత నీతిమాలిన రాజకీయాలనైనా చేయగలడని, ఎవ్వరితోనైనా పొత్తు పెట్టుకోగలడని అన్నారు. తన తల్లిని, భార్యను, చివరికి ప్రధాని అనే కనీస గౌరవం లేకుండా తనను తిట్టిన చంద్రబాబును మోదీ దూరంగా పెడితే మంచిదని అభిప్రాయపడ్డారు.
చంద్రబాబును జైలు నుంచి బయటికి తీసుకుని రావడానికి నారా లోకేష్.. పురంధేశ్వరి కాళ్లు పట్టుకుని, అమిత్ షాను కలిశాడని రోజా ఎద్దేవా చేశారు. ఆ తరువాతే బాబుకు బెయిల్ వచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాలను మోసిన తెలుగుదేశం నాయకులు ఏపీలో బీజేపీ జెండాలను మోయడానికి సిద్దపడ్దారని విమర్శించారు.












Click it and Unblock the Notifications