టీడీపీ టార్గెట్‌గా బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు( వీడియో )
ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు దీరింది. టీడీపీ,బీజేపీ , జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి వైసీపీని ఎదుర్కొని ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా బీజేపీకి 1 శాతం ఓటు బ్యాంకు లేకపోయినా.. 8 మంది ఎమ్మల్యేలు విజయం సాధించారు. అదేసమయంలో ఆరు స్థానాల్లో పోటీ చేసి 3 ఎంపీ స్థానాల్లో విజయం దక్కించుకుంది. బీజేపీకి ఏపీలో ఇది అతి పెద్ద విజయమనే చెప్పాలి. ఇక బీజేపీ నుంచి విజయం సాధించిన నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.
కేంద్ర మంత్రిగా తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ఆయన పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన మాట్లాడుతూ ..''నాకు ఎంపీ సీటు వచ్చిన తర్వాత.. కూడా కొందరు ఎల్లో బ్యాచ్.. నాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. నేను పోటీకి అనర్హుడినని.. టికెట్ ఇచ్చి వృధా చేశారని.. దీనిని రేపో మాపో వేరేవారికి ఇచ్చేస్తారని.. పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ.. నేనేంటో నేను నిరూపించుకున్నా. నరసాపురంలో విజయం దక్కించుకున్నా. ఇప్పటికైనా ఎల్లో మీడియా.. ఎల్లో బ్యాచ్ పద్దతిగా ఉండాలి'' అని వ్యాఖ్యానించారు.

పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి వేదిక మీద ఉండగానే నరసాపురం ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాసవర్మ చేసిన వ్యాఖ్యలపై వేదికపై ఉన్న నేతలంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఆయన టీడీపీ నాయకులను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయం వ్యక్త అవుతోంది.
ఎల్లో మీడియాపై బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మ సంచలన కామెంట్స్..!#BhupathiRajuSrinivasaVarma #MPSrinivasaVarma #TDP #AndhraPradesh #ViralVideo #Oneindiatelugu pic.twitter.com/Xzpom1wqJq
— oneindiatelugu (@oneindiatelugu) June 21, 2024
నరసాపురం సిట్టింగ్ ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణంరాజు తిరిగి అక్కడ నుంచి పోటీ చేయాలని విశ్వప్రయత్నాలు చేశారు. రఘురామకు నరసాపురం ఎంపీ టికెట్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు సైతం గట్టిగానే ప్రయత్నించారు. కానీ బీజేపీ అధిష్టానం శ్రీనివాసవర్మ వైపు మొగ్గు చూపించడంతో రఘురామను టీడీపీలో చేర్చుకుని ఉండి ఎమ్మెల్యే టికెట్‌ను కేటాయించారు. తనకు టికెట్ ప్రయత్నించిన టీడీపీ నేతలకు కేంద్ర మంత్రి ఈ విధంగా కౌంటరిచ్చారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications