వైసిపి పాత్ర: ముద్రగడపై రెచ్చిన చినరాజప్ప, 'తుని'పై పాయింట్ లాగిన నారాయణ
హైదరాబాద్: హింసాత్మక ఘటనకు తెలుగుదేశం పార్టీని బాధ్యులుగా చేయడం సరికాదని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కాపు నేత ముద్రగడ పద్మనాభం పైన మండిపడ్డారు. కాపులకు ఇచ్చిన మాట పైన తాము కచ్చితంగా నిలబడి ఉన్నామని చెప్పారు. చంద్రబాబు ఇచ్చిన మాట తప్పరన్నారు.
బీసీలకు అన్యాయం చేయకుండా తాము కాపులకు బీసీలను చేర్చే విషయమై కమిటీ వేశామన్నారు. వైసిపి ముసుగులో ముద్రగడ ఈ కాపు గర్జన చేశారని ఆరోపించారు. ఇందులో వైసిపి పాత్ర ఉందన్నారు. కాపుల కోసం కమిషన్ వేస్తామని చెప్పామని, ఇచ్చిన మాట ప్రకారం అది వేశామన్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదన్నారు. కాపు గర్జన వేదిక పైన అన్ని పార్టీల నేతలు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీనే విమర్శించడం ఏమిటన్నారు. అన్ని పార్టీలను పిలిచి టిడిపిని తిట్టడమేమిటన్నారు.

మంత్రి నారాయణ మాట్లాడుతూ.. నిన్నటి ఘటన దురదృష్టకరమన్నారు. ముద్రగడ చేసిన ప్రకటన తప్పు అన్నారు. పట్టాలపై ధర్నా, రోడ్డు పైన కూర్చోవడం ముద్రగడ అప్పటికి అప్పుడు ప్రకటించారని, అలాంటప్పుడు అది కేవలం ముద్రగడ, వారి అనునయులకు మాత్రమే తెలుసునని, అలాంటప్పుడు ఆ ఘటనకు బాధ్యులు ఎవరో ఆలోచించాలన్నారు.
ఎవరికీ తెలియకుండా రోడ్ల పైకి ఎక్కాలని ముద్రగడ ప్రకటించారని, అలాంటప్పుడు దాడిలో వారి పాత్ర లేకుండా ఎలా ఉంటుందని మంత్రి నారాయణ పాయింట్ లాగారు. ముద్రగడ కాపులను మభ్య పెట్టేందుకు ఈ పనులు చేస్తున్నారని మండిపడ్డారు. జీవో 30 అంటే కాపులను మభ్య పెట్టడమే అన్నారు.
ఇచ్చిన జీవోను అమలు చేయమని నాడు కోర్టుకు ప్రభుత్వమే చెప్పిందన్నారు. వేదిక పైన రెచ్చగొట్టేలా మాట్లాడింది ముద్రగడనే అన్నారు. ఘటన పట్ల చింతించకుండా విమర్శలు చేయడ ఏమిటన్నారు. రిజర్వేషన్, బీసీలలో చేర్చేందుకు కమిషన్ వేశామని, దీని కోసం తొమ్మిది నెలలు ముద్రగడ ఆగలేకపోయారాఅన్నారు.
కాపులకు టిడిపియే న్యాయం చేస్తుందన్నారు. ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా రెచ్చగొడుతున్నారన్నారు. లక్షళ మందిని రెచ్చగొట్టి విధ్వంసం సృష్టించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కాపులకు కచ్చితంగా రిజర్వేషన్ ఇస్తారన్నారు.
ముద్రగడ కాపు జాతికి ఉపయోగపడే వ్యక్తి కాదని చిన రాజప్ప అన్నారు. కాపులు తన వద్దకు రావొద్దని బోర్డు కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయన్నారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం వంద శాతం హామీలు నెరవేరుస్తామన్నారు. ముద్రగడ తాను ఓ పెద్ద నాయకుడు అని చెప్పుకుంటున్నాడని, ఆయన పోటీ చేస్తే తొమ్మిది వేల ఓట్లు వచ్చాయని దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications