రెచ్చిపోయిన ఎమ్యెల్యే జలీల్ ఖాన్..! : విద్యాశాఖ అధికారులకు గట్టి వార్నింగ్
విజయవాడ : ఓవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేల ఒత్తిడులు.. మరోవైపు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేల సిఫారసులు.. ఈ రెండింటి నడుమ నలిగిపోతూ అధికారులు. ప్రస్తుతం ఏపీలో టీచర్ల బదిలీకి సంబంధించి ఆ ప్రక్రియను పర్యవేక్షిస్తోన్న అధికారుల పరిస్థితి ఈవిధంగా తయారైందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే.. తన ఆదేశాల మేరకు టీచర్ల బదిలీలను చేపట్టట్లేదన్న కారణంతో విద్యాశాఖ అధికారులకు వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అంశం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. తన సూచనల మేరకు బదిలీలను చేపట్టాలని ఎమ్మెల్యే జలీల్ ఖాన్ విద్యాశాఖ అధికారులను ఆదేశించగా.. అందుకు విద్యాశాఖ అధికారులు అభ్యంతరం తెలపడంతో.. తీవ్ర ఆగ్రహానికి లోనైన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అధికారులకు వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది.
అసలు విషయానికొస్తే.. ప్రస్తుతం కార్పోరేషన్ల పరిధిలోని పాఠశాలల్లో టీచర్ల బదిలీ ప్రక్రియను చేపట్టింది ప్రభుత్వం. దీంతో బదిలీల విషయాల్లో నేతలు తమ పలుకుబడిని ఉపయోగించి జోక్యం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తనకు అనుకూలురైన కొంతమంది టీచర్లను వెంటబెట్టుకుని వెళ్లి.. వాళ్లందరికీ తను సూచించిన స్థానాల్లోనే పోస్టింగులు జరిగేలా చూడాలని కమిషనర్ తో చెప్పారు.

దీంతో ఇదే విషయాన్ని విద్యాశాఖ ఇంఛార్జీ, అదనపు కమిషనర్ అరుణకుమార్ కి దృష్టికి తీసుకెళ్లిన కమిషనర్, వాళ్ల సమక్షంలోనే ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తో బదిలీల విషయంపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆదేశాలకు బదులిచ్చిన అరుణకుమార్.. 'బదిలీలకు సంబంధించిన ప్రక్రియలో సిఫారసులకు ఎలాంటి తావు లేదని, ఖచ్చితంగా బదిలీలన్ని కౌన్సెలింగ్ ద్వారానే జరుగుతాయని' తేల్చి చెప్పారట.
అంతేకాదు, 'గతంలో మీ ఆదేశాల మేరకే ఓ పని చేశా.. అలాంటి తప్పులు మరోసారి చేయలేనని, ఇలాంటివి తమ దృష్టికి తీసుకురావద్దని' గట్టిగానే బదులిచ్చారట అరుణకుమార్. ఇంకేముంది అందరి తన పరువు తీసేశాడని సహనం కోల్పోయిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్.. "చూస్తా.. అదీ చూస్తా.. నా మాటను లెక్కచేయకుండా బదిలీలు ఎలా చేపడుతారో..? చూస్తా.." అంటూ అధికారులకు వార్నింగ్ ఇచ్చినట్టుగా సమాచారం.












Click it and Unblock the Notifications